భ‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ద్గీతను బోధనాంశంగా చేర్చాలె

ప్రస్తుత కార్పొరేట్​యుగంలో విద్యార్థులు ర్యాంకులు, సీట్ల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే పిల్లలకు ఒక్క సబ్జెక్ట్​ నాలెడ్జ్​ మాత్రమే సరిపోదు. రేపటి సమాజంలో సంతృప్తికరంగా జీవించాలన్నా.. భవిష్యత్​లో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నా.. సంఘంలో బాధ్యతగల పౌరుడిగా ఉండాలన్నా.. సాంస్కృతిక, నైతిక విలువలు ఎంతో అవసరం. నేటి తరం విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు ‘భగవద్గీత’లో ఉన్నాయి. అందుకే గుజరాత్​లోని పాఠశాలల్లో భగవద్గీతను బోధనాంశంగా చేరుస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటక కూడా ఇదే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పిల్లల్లో సాంస్కృతిక విలువలు పడిపోతున్నందున మోరల్​సైన్స్​లో భాగంగా గీతను బోధించనున్నామని, విద్యా నిపుణులతో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని కర్నాటక విద్యాశాఖ మంత్రి బి.సి. నగేశ్​ ఆ మధ్య తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని బడుల్లో కూడా గీతను బోధనాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది.
విద్య అంతిమ లక్ష్యం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి. ఒకప్పుడు విద్యను జ్ఞాన సముపార్జన సాధనంగా చూసేవారు. విద్య జ్ఞానం పెంచడంతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైతికత, సమాజం పట్ల బాధ్యత పెంచేదిగా ఉండాలి. అయితే ఇవన్నీ ప్రస్తుత విద్యార్థులకు అందుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. ఆయా పరిస్థితులనుబట్టి సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయాలు తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పండం లేదు. సామాజిక మాధ్యమాలు, సినిమాలు, ఇతర వ్యాపకాలు స్టూడెంట్లపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. నేటి తరం యువతకు ఆత్మవిశ్వాసం ఉండటం లేదు. చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కోలేక మానసికంగా ఇబ్బంది పడుతోంది. చదువును ఉపాధికి మార్గంగానే చూస్తున్నారు తప్ప వ్యక్తిత్వ నిర్మాణంపై దృష్టి పెట్టడం లేదు. భవిష్యత్​లో వచ్చే సమస్యలను ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యాన్నిచ్చే ఏ గ్రంథమేదైనా విద్యార్థులకు ఉపయోగకరమైనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి తరం విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే ఎన్నో వ్యక్తిత్వ వికాస అంశాలు భగవద్గీతలో ఉన్నాయి. ఇదేదో ఒక మతానికి చెందిన గ్రంథం కాదు. ఇందులో ఆత్మ తత్వం, జీవన గమ్యం, లక్ష్య సాధనల గురించి గొప్పగా ఉంది. 

దారి చూపేదిగా..

అజ్ఞానపు చీకటిలో ఉన్న వ్యక్తిలో జ్ఞానమనే వెలుగును నింపి కర్తవ్యం గుర్తు చేస్తూ.. ముందుకు నడిపేదే గీత. కురుక్షేత్రంలో అర్జునుడు ఎదుర్కొన్న ఇబ్బందులు వంటివే.. ప్రస్తుతం ఎంతో మంది యువతరం ఎదుర్కొంటోంది. అలాంటి వారికి గీత సరైన మార్గం చూపుతుంది. సమాజంలో నీ కర్తవ్యం ఏమిటి? ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఏం చేయాలి? లక్ష్య సాధనలో ఇబ్బంది పెట్టే వివిధ అంశాలను ఎలా ఎదుర్కోవాలని గీత బోధించింది. ఇలాంటి అంశాలన్నీ నేటి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే వివిధ దశల్లో వివిధ రకాల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. తాను చేయాల్సిన పనిని భారంగా భావించాలా? లేక ఇది నా ధర్మం, దీన్ని స్వార్థ భావన లేకుండా సరిగా చేయడం వల్ల.. నాకు.. తద్వారా సమాజానికి ఉపయోగపడుతుందనే భావనతో చేయాలా? అన్నది ప్రశ్న. ఈ రెండింటిలో, రెండో పద్ధతిలో పనిచేయడమే గీతలో చెప్పిన కర్మయోగం. ఈ కర్మ యోగం వల్ల మనిషి తాను చేసే పనిని మరింత సులభతరంగా, శ్రద్ధగా, బాధ్యతగా చేయగలడు. ఎంతో మంది విదేశీ తత్వవేత్తలు గీతా సారాన్ని ప్రశంసించిన వారే. జీవితం ఆనందంగా గడపాలన్నా, చేస్తున్న పనిలో విజయం సాధించాలన్నా గీతను తప్పక చదవాలి. జీవితారంభంలో చదవాల్సిన ఈ గ్రంథాన్ని ‘జీవితాంతంలో చదవాలి’ అనే నానుడితో అత్యంత విలువైన జ్ఞానాన్ని నేటి యువత కోల్పోతున్నది.

నైతిక విలువలను పెంచేందుకు..

గీతా బోధన వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు ధర్మబద్ధమైన ప్రవర్తన అలవాటవుతాయి. విద్యార్థులను మానవత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో, వారిని సన్మార్గంలో నడిపించడంలో భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది. అంతేగాకుండా ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వేదాల్లోని సారాంశం, విజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. భగవద్గీత పఠనం ద్వారా యువతకు ఓటమిని తట్టుకునే శక్తి, మనో ధైర్యం పెరుగుతాయి. తద్వారా చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు. వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా గీతను ఆధారం చేసుకునే యువతకు శిక్షణ ఇస్తున్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదే. భగవద్గీతలో మొత్తం18 అధ్యాయాలు,700 శ్లోకాలు ఉన్నాయి. ఆరు నుంచి 8వ తరగతి వరకు కథలు, శ్లోకాల రూపంలో భగవద్గీత పాఠాలు బోధించవచ్చు. 9- నుంచి12వ తరగతి విద్యార్థులకు కథ, శ్లోకాలు ఫస్ట్ లాంగ్వేజ్ పాఠ్యపుస్తకం ద్వారా చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రామాయణం, మహాభారతంలోని అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో రామాయణం, మహాభారత ఇతిహాసాలు ఇంజనీరింగ్ సిలబస్‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. ఆ మధ్య కేంద్రమంత్రి ప్రహ్లాద్‌‌‌‌‌‌‌‌ జోషి కూడా గీతా బోధనపై ఆసక్తికర కామెంట్లు చేశారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌ తరహాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో భగవద్గీత బోధించే ఆలోచన చేయాలని ఆయన సూచించారు. భగవద్గీత నైతికతను బోధిస్తుందని, సమాజ శ్రేయస్సు పట్ల పౌరుల బాధ్యతను తెలియజేస్తుందని, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అనేక కథలు అందులో ఉన్నాయని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయాలని ఆయన సూచించారు. కేంద్ర మంత్రి మాటలపై అన్ని రాష్ట్రాలు ఆలోచించాలి. విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గ్రంథాన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- డా. రామకృష్ణ బండారు, అసిస్టెంట్ ప్రొఫెసర్,  కిట్ వర్సిటీ, ఒడిశా