- ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లకు వర్తింపు
- నిర్ణయించిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్: డిగ్రీ చదువుతున్న స్టూడెంట్లను క్రెడిట్స్ తో సంబంధం లేకుండానే ప్రమోట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిటెన్షన్ విధానం లేకుండా ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లను పై తరగతులకు పంపించాలని డిసైడ్ చేసింది. నిబంధనల ప్రకారం.. డిగ్రీ విద్యార్థులు ఉన్నత తరగతికి ప్రమోషన్ పొందాలంటే కనీసం 50 శాతం క్రెడిట్ పాయింట్స్ ను సాధించాల్సి ఉంటుంది. వాటితో సంబంధం లేకుండానే ఈ అకడమిక్ ఇయర్ లో మొదటి, రెండో సంవత్సరం స్టూడెంట్లను ప్రమోట్ చేస్తామని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్ పాపి రెడ్డి ప్రకటించారు. మొదటి సంవత్సరం విద్యార్థులను రెండవ సంవత్సరానికి, రెండవ సంవత్సరం విద్యార్థులను మూడవ సంవత్సరానికి పంపుతామని చెప్పారు. వారంతా వచ్చే ఏడాది పరీక్షల్లో బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుందన్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే, ఈ నిబంధన చివరి సంవత్సరం విద్యార్థులకు వర్తించదని స్పష్టం చేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం అన్ని పరీక్షలు పూర్తిచేసిన తర్వాత డిగ్రీ పట్టా పొందాల్సి ఉంటుందన్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరీక్షలు
డిగ్రీ పరీక్షల తర్వాతే పీజీ ఎంట్రెన్స్ లు
యూనివర్సిటీల అనుబంధ కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు మాత్రం వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లకు టీఎస్‌సీహెచ్‌ఈ ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే కరోనా ఎఫెక్టు వల్ల పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించనుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (EAMCET), ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ECET) మొదట నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. డిగ్రీ ఎలిజిబులిటీతో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రెన్స్ లు(సెట్) మాత్రం డిగ్రీ పరీక్షలు పూర్తయిన తర్వాతే జరుగుతాయన్నారు.