డబుల్ బెడ్​రూం ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేస్తున్న అధికారులు

  • రేకుల షెడ్లు, కూలే దశలో ఇల్లు ఉన్నోళ్లకు సెకండ్​ ప్రయారిటీ 
  • ఇందిరమ్మ ఇల్లు, సొంత ఇల్లు ఉన్నోళ్లకు నో చాన్స్
  • అర్హుల సంఖ్య ఎక్కువుంటే గ్రామస్తుల సమక్షంలో లాటరీ
  • సంక్రాంతికల్లా పంపిణీ చేస్తామన్న సర్కారు

నల్గొండ, వెలుగు: అసలే ఇండ్లు లేనోళ్లకు, గుడిసెల్లో ఉంటున్నోళ్లకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఆ తర్వాత రేకులషెడ్లు, శిథిలావస్థకు చేరిన మట్టి ఇండ్లలో ఉంటున్నోళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఈమేరకు రూరల్​, అర్బన్​ ఏరియాల్లో  సామాజికవర్గాలవారీగా ఎవరికి ఎంత శాతం ఇండ్లు కేటాయించాలో ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఎక్కువ మంది అర్హులు ఉంటే గ్రామ, వార్డు సభల్లో ప్రజల సమక్షంలో లాటరీ తీయాలని కలెక్టర్లకు ఆర్డర్స్​వచ్చాయి. జనవరి15న  సంక్రాంతికి గృహప్రవేశం చేయించేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆదేశాల మేరకు ఆఫీసర్లు లబ్ధిదారుల లిస్టులు ఫైనల్​ చేయడంలో బిజీ అయ్యారు.

తుదిదశలో 40 వేల ఇండ్లు..

రాష్ట్రంలో గూడులేని పేదల కోసం 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మించి ఇస్తామని ఆరేండ్ల కింద  టీఆర్ఎస్ సర్కారు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు జీహెచ్ఎంసీ మినహా 62 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మాత్రమే పూర్తి చేసింది. మరో 40 వేల ఇండ్లు  తుది దశలో ఉన్నాయని ఇటీవల హౌసింగ్ మినిస్టర్ ప్రశాంత్​రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 26 వేల ఇండ్లను పంపిణీ చేశామని చెప్పారు. పూర్తయి రెడీగా ఉన్న 18వేల డబుల్​ బెడ్​రూం ఇండ్లకు జనవరి 14 కల్లా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఇటీవల కలెక్టర్లను ఆదేశించారు. 

తుదిదశలో ఉన్న 40వేల ఇండ్లకు కూడా లబ్ధిదారులను ఫైనల్​చేసి లిస్టులను రెడీగా ఉంచుకోవాలన్నారు. వీటిని కూడా వచ్చే ఎన్నికల ముందు పంపిణీ చేసే చాన్స్​ ఉంది. దీంతో డబుల్​ బెడ్​రూం ఇండ్లు  పూర్తయిన గ్రామాలు, పట్టణాల్లో ఆఫీసర్లు రంగంలోకి దిగి, లబ్ధిదారుల ఫీల్డ్​ సర్వే చేపడ్తున్నారు. గతంలో డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీ సందర్భంగా చాలాచోట్ల గొడవలు జరిగాయి. రూలింగ్​పార్టీ లీడర్లు   రూ. లక్షదాకా కమీషన్లు తీసుకొని అనర్హులను ఎంపిక చేశారంటూ అర్హులు ఆందోళనకు దిగారు. రాబోయేది ఎలక్షన్​ ఇయర్​ కావడంతో ఇలాంటివి జరిగితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న ప్రభుత్వపెద్దలు ఈసారి ఎలాంటి పైరవీలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పటికే ఇండ్లకోసం పైసలిచ్చినోళ్లు, ఇండ్లు ఇప్పిస్తామని కమీషన్లు తీసుకున్నోళ్లు ఆందోళన చెందుతున్నారు. 

ఇండ్ల  కేటాయింపులో రూల్స్ ఇవీ..

ఇప్పటివరకు ఎలాంటి ఇల్లు లేనివాళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. రెండో ప్రాధాన్యత కింద గుడిసెలు, కచ్చా ఇండ్లు, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నోళ్లను పరిగణలోకి తీసుకుంటారు. వితంతువులను, భార్య చనిపోయిన మగవాళ్లను, దివ్యాంగులను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణిస్తారు. లబ్ధిదారులు రేషన్​ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. రూరల్​ ఏరియాల్లో  ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీలకు 7 శాతం , జనరల్ కోటా కింద 43 శాతం కేటాయిస్తారు. జనరల్ కేటగిరీలో మళ్లీ అన్ని సామాజిక వర్గాలకు ప్రయారిటీ ఇస్తారు.

అర్బన్​లో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6శాతం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి. మిగిలిన 65 శాతం జనరల్ కేటగిరీకి కేటాయిస్తారు. ఈ జనరల్ కోటాలోనూ అన్ని వర్గాలకు ప్రధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. అర్హుల నుంచి ముందుగా అప్లికేషన్ స్వీకరించి, తర్వాత ప్రత్యేక టీమ్​లతో ఫీల్డ్​ వెరిఫికేషన్​ చేయిస్తున్నారు. ఇండ్ల సంఖ్యకు మించి అర్హులు ఉంటే కేటగిరీల వారీగా డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మిగిలిన వాళ్లను వెయిటింగ్ లిస్ట్​లో చేరుస్తారు. వారిలో ఎవరికైనా సొంత జాగా ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.3లక్షల స్కీంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఆఫీసర్లకు 44 రోజుల డెడ్​లైన్​..

జనవరి 15న సంక్రాంతి కానుకగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలని సర్కారు ఆదేశించడంతో జిల్లాల్లో అధికారులు ఉరుకులు పరుగులు పెడ్తున్నారు. కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను చాలారోజులుగా పంపిణీ చేయకపోవడంతో అనేకచోట్ల ఇండ్ల తలుపులు విరిగి, కిటికీలు పగిలిపోయి ఉన్నాయి. కాలనీల్లో తుమ్మ చెట్లు పెరిగాయి. దీంతో అధికారులు వాటికి రిపేర్లు చేయించే పనిలో పడ్డారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపైనా ఫోకస్​ పెట్టారు. డబుల్​ బెడ్​రూం కాలనీల్లో పల్లె, పట్టణ ప్రగతి నిధులతో రోడ్లు వేయించాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి.

దీంతో పంచాయతీ, మున్సిపల్​ ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక శానిటేషన్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కోసం పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ ఆఫీసర్లు టెండర్లు పిలుస్తున్నారు. అయితే మౌలిక వసతులకు ఒక్కో యూనిట్​కు  రూ.1.25 లక్షలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపట్లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఏదేమైనా సర్కారు ఈ విషయంలో సీరియస్​గా ఉన్నందున  మౌలికవసతులు కల్పించేందుకు ఆఫీసర్లు నానాతంటాలు పడ్తున్నారు.