మీడియం మారితే బతుకు మారది

తెలంగాణలో 2022–-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదించాక దీనికి సంబంధించి ప్రకటన వెలువడింది. ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగుతుందని సర్కారు చెబుతున్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే తెలుగు మీడియం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతృభాషలో విద్యా బోధన అనే విధానపరమైన నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి, మాతృభాష బోధనా సమర్థకులు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ సమాంతర మీడియం వ్యూహం. ఇది కాగితాలకే పరిమితం అవుతోంది. ఆచరణలో మాతృభాష బోధనా స్థానాన్ని ఇంగ్లిష్ పూర్తిగా ఆక్రమించనుంది. కనీస సౌకర్యాలు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా మీడియం మార్చినంత మాత్రాన విద్యా వ్యవస్థ బాగుపడదు. కాకుంటే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకోవడానికి ఒక పథకంగా మాత్రమే ఉపయోగపడుతుంది.

ఇంగ్లిష్ మీడియం పట్ల తల్లిదండ్రుల్లో వ్యామోహం పెరిగి మాతృభాషలో విద్యా బోధన ఇక కాలగర్భంలో కలిసిపోనుంది.  ఇది గత చరిత్రగానే మిగిలిపోనుంది. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో 48 శాతం , గురుకులాల్లో 100 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 98 శాతం, ఎయిడెడ్ స్కూళ్లలో 67 శాతం మంది స్టూడెంట్లు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. మాతృభాషలో భోదన ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే పరిమితం అయ్యింది. ఉన్నత వర్గాలు ఇంగ్లిష్ మీడియంలో చదువులను పొందుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలు సైతం ఇంగ్లిష్ మీడియం కోసం అప్పులు చేసి చదివిస్తున్న పరిస్థితి ఉంది. 

మాతృభాషలోనే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి

ఈ నిర్ణయం వల్ల ఈ వర్గాలకు కూడా ఇంగ్లిష్ మీడియం బోధన ఉచితంగా అందనుందని, విద్యలో అసమానతలు ఉండవనేది ప్రభుత్వ వాదన. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి ఈ నిర్ణయం గొప్ప ముందడుగు కాగలదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ఇంగ్లిష్ మీడియం మోజులో మాతృభాషలో విద్యా బోధన వల్ల కలిగే ప్రయోజనాలు తిరస్కరణకు గురైనాయి. పిల్లల జ్ఞాన సముపార్జనకు, విషయాల పట్ల అవగాహనకు, సంపూర్ణ వికాసం పొందడానికి మాతృభాషలో విద్యా బోధనకు మించిన ప్రత్యామ్నాయం లేదని, ఇతర భాషలు నేర్చుకోవడానికి కూడా మాతృభాషా ప్రావీణ్యమే తేలికైన మార్గమని ప్రపంచ మనో వైజ్ఞానికులు, శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయంగా వెల్లడించారు. పరాయి భాషలో బోధన పిల్లల్లో చాలా వరకు బట్టీ పట్టే పద్ధతిని అలవాటు చేస్తుందని అందరూ అంగీకరిస్తున్నదే. అందుకే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో నేటికీ స్కూల్ స్థాయి బోధన మాతృభాషలోనే జరుగుతోంది. నూతన జాతీయ విద్యా విధానంలోనూ ఇదే పద్ధతిని అక్షరాలా ఆమోదించారు. కానీ, అమలులో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సృష్టించిన అవాంఛనీయ పోటీని నిలువరించడంలో విఫలమయ్యాయి. స్కూల్ విద్యనైనా, కనీసం ప్రాథమిక స్థాయి విద్యా బోధన వరకైనా మాతృభాషలో కొనసాగించలేకపోయాయి. 

బడుల్లో సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వ బడుల్లో ఏండ్లకేండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించకుండా, మౌలిక సదుపా యాలు కల్పించకుండా కేవలం మీడియం మార్చు తూ కాగితాల్లో ఉత్తర్వులు జారీ చేసినంత మాత్రాన పెను మార్పులు వస్తాయని భావిస్తే అది ఆత్మవంచనే. రాష్ట్రంలో ఉన్న మొత్తం 26,085 ప్రభుత్వ బడుల్లో 98 శాతం వాటిలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవనేది పచ్చి నిజం. 2018–-19 ప్రభుత్వ లెక్కల ప్రకారమే సరిపడా గదులు లేని స్కూళ్లు 10,230, ప్రహరీ గోడలు లేనివి 8,275, టాయిలెట్లు లేనివి 9 వేలకు పైగా ఉన్నాయి. గదులు లేక చెట్ల కింద నడుస్తున్న బడులు ఒకవైపు, గదులున్నా టాయిలెట్లు, బాత్​రూమ్‌లు, నీటి సౌకర్యం, ప్రహరీ గోడ, ఆట స్థలం, వంటగదులు లేనివి మరోవైపు కొనసాగుతున్నాయి. నెలకు 2 వేల రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో స్కూల్ పరిశుభ్రత కోసం టీచర్లు, స్టూడెంట్లే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఈ పనులను గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 

సరిపడా టీచర్లు లేక ఇబ్బందులు

ఓ పక్క టీచర్లు లేక బోధన కుంటుపడుతున్న పరిస్థితి నెలకొంది. హెడ్ మాస్టర్లు, మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు లేక పర్యవేక్షణ కుంటుపడింది మరోపక్క. ఒక్కొక్కరినీ 4,5 మండలాలు, 2,3 జిల్లాలకు ఇన్​చార్జ్​లుగా ఉంచితే పాలనా, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించడం ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ అలా ఉంటే.. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతున్న బడులు కూడా సమస్యల సుడిగుండంలోనే ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన 2.50 లక్షల మంది విద్యార్థులకు ఇంకా టెక్ట్స్ బుక్స్ కూడా అందించలేదు. విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి వీటి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. 

ఇచ్చిన హామీలు అమలు జరిగేదెన్నడు

ఇంగ్లిష్ మీడియంతో పాటు కనీస సౌకర్యాల ఏర్పాటుకు ‘మన ఊరు-–- మన బడి’ అనే ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీని ద్వారా మొదటి దశగా రాష్ట్రంలోని 9,123 పాఠశాలల్లో వసతుల కల్పనకుగాను రూ.7,289 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో రాబోయే మూడు నెలల్లోనే రూ.3,497 కోట్లతో బడులు బాగు చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు బడులను ఎంపిక చేయగా పనులన్నీ పూర్తి కావొచ్చాయని, అదే రీతిన ఎంపిక చేసిన అన్ని స్కూళ్లల్లో జరుగుతుందని విద్యా శాఖ మంత్రి వివరించారు. అయితే ఈ ప్రకటనలన్నీ ఆచరణలో ఎంతమేరకు సాధ్యం అనేదే అసలు ప్రశ్న. గతంలో సంవత్సరానికి రూ.2,000 కోట్ల చొప్పున విద్యా రంగానికి కేటాయిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్వయంగా సీఎం ఇచ్చిన హామీ నీటి మీద రాతగానే మిగిలిపోయింది.  సీఎం కలగన్న కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఇంకా కలగానేఉంది. అలాగే రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయింపులు 14 శాతం ఉండాల్సి ఉండగా దానిని 6% కు తగ్గించారు. ఇంకా 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఆచరణ సాధ్యంకాని హామీలతో లాభం లేదు

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి చిత్తశుద్ధి లేని, ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. కనీస సౌకర్యాలు కల్పించకుండా, ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక టీచర్ ను నియమించకుండా మీడియం మార్చినంత మాత్రాన విద్యా వ్యవస్థ బాగుకు అదే మంత్రదండం కాదు. కాకుంటే ప్రభుత్వం ప్రకటించుకోవడానికి ఉపయోగపడుతుంది. మన ఊరు మనబడిలో పేర్కొన్న 12 అంశాలలో ఇంగ్లిష్ మీడియం విషయం పేర్కొనలేదు. వార్షిక బడ్జెట్​లో విద్యకు ఎంత శాతం నిధుల పెంపుదల ఉంటుందో చెప్పలేదు. ఇంగ్లిష్ మీడియంలో స్టూడెంట్లకు పూర్తిస్థాయి నైపుణ్యాలు పొందాలంటే  ముందుగా టీచర్లకు ఇఫ్లూ లాంటి సంస్థల్లో శిక్షణ ఇప్పించవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే ప్రభుత్వ బడుల్లో బోధన మెరుగుపడి.. సర్కారు లక్ష్యం నెరవేరుతుంది.

ఇంగ్లిష్ మీడియం పరుగుతో భవిత ఆగం

పెట్టుబడి సృష్టించిన పోటీ భ్రమల్లో తల్లిదండ్రులు, సమాజం కూడా అనివార్యంగా ఇంగ్లిష్ మీడియం వైపు పరుగులు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టే బదులు ప్రైవేటు స్కూళ్లలో మాతృభాషలో బోధనను తప్పనిసరి చేస్తే సరైన నిర్ణయంగా ఉండేది. కానీ, ఇది జాతీయ స్థాయిలో అమలు జరపాల్సిన నిర్ణయం. కార్పొరేట్, ప్రైవేట్ వర్గాలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేవన్న వాస్తవం మరోసారి నిరూపితమవుతోంది. అయితే దీనికి మూల్యం దేశ భవితవ్యం అని మరవరాదు. చిప్ అమర్చిన రోబోలు పనిచేస్తున్నట్లుగానే, రానున్న రోజుల్లో సామాజిక, కుటుంబ, నైతిక, మానవీయ విలువలు లేని యంత్రాల వంటి సమాజం నిర్మితం కానుంది. ఇప్పటికే మనుషుల్లో విలువలు కొరవడిన యంత్రతత్వం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రతి నిత్యం చూస్తూనే ఉన్నాం.
- మైస శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి