పట్టాలు కాదు.. హక్కు పత్రాలే! అమ్మలేరు, కొనలేరు.. విరాసత్​కు చాన్స్

పట్టాలు కాదు.. హక్కు పత్రాలే!
అమ్మలేరు, కొనలేరు.. విరాసత్​కు చాన్స్
క్రాప్ లోన్లే తప్ప మార్టిగేజ్ చేయలేరు
ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్టులోనే ‘పోడు పట్టాలు’
కేసీఆర్ బొమ్మతో కొత్త పాస్ బుక్స్
4.14 లక్షల అప్లికేషన్లలో 1.50 లక్షలకే మోక్షం

కరీంనగర్, వెలుగు : ఎన్నో ఏండ్లుగా పెండింగ్​లో పెట్టిన పోడు పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభించింది. అటవీ హక్కుల చట్టం–2006 కింద జారీ చేస్తున్న ఈ పట్టాలు.. గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ పట్టాల్లాంటివే. హక్కు పత్రాల ద్వారా వీటిపై గిరిజనులకు సాగు హక్కులను మాత్రమే ప్రభుత్వం కల్పించింది. ఇతర యాజమాన్య హక్కులు ఈ పోడు భూములకు వర్తించవు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జారీ చేసిన రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్(ఆర్వోఎఫ్ఆర్) పట్టాల వివరాలను.. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఇవే వివరాలు ఇప్పుడు ధరణి పోర్టల్ లోనూ కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్న హక్కు పత్రాల వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేయనున్నారు.

అసైన్డ్ ల్యాండ్స్ లాగే

ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు బ్యాంకర్లు క్రాప్ లోన్లు మంజూరు చేయడానికి వీలుంది. అయితే వీటిని తనఖా(మార్టిగేజ్) పెట్టి లోన్ తీసుకునే అవకాశం మాత్రం ఉండదు. అలాగే ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్(ఎల్టీఆర్) 1/70 యాక్ట్ ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలోని  గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయడానికి వీల్లేదు. గతంలో ఇచ్చిన అటవీ హక్కుల పత్రాల్లోని నిబంధనల ప్రకారం గిరిజనులు మరో గిరిజనుడికి కూడా భూములు అమ్మడానికి వీల్లేదు. అసైన్డ్ ల్యాండ్స్ లాగే కేవలం విరాసత్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఆ భూములను సాగు చేసుకునే హక్కు ఉంది. ఇప్పుడు పట్టాలు పొందిన భూములను కూడా అమ్మడానికి కుదరదు. ఈ భూములను ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చనున్నారు.

మొత్తం పోడులో మూడో వంతుకే పట్టాలు

పోడు సమస్యను తానే స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని, అందరికీ పట్టాలిస్తానని రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ పలు సార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు నిరుడు పోడు పట్టాల కోసం అప్లికేషన్లు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 12.5 లక్షల ఎకరాలకు గాను 4.14 లక్షల దరఖాస్తులు అందాయి. అయితే ఏడాది తర్వాత వీటిలో కేవలం మూడో వంతు విస్తీర్ణాన్నే ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసీ, గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,01,405 ఎకరాలకుగాను 1,50,224 మంది రైతులకు హక్కు పత్రాలను సిద్ధం చేసింది. కాంగ్రెస్ హయాంలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందినవాళ్లు 96 వేల మంది వరకు ఉన్నారు. వీళ్లు కూడా ఐదేండ్లుగా రైతు బంధు, రైతు బీమాలాంటి స్కీమ్ లకు నోచుకోలేదు. ఎట్టకేలకు కొత్త పాస్ బుక్స్ రావడంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం త్వరలో పాత, కొత్త పోడు రైతులు కలిపి సుమారు రెండున్నర లక్షల మందికి రైతు బంధు, రైతు బీమా వర్తించనుంది.