జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ సందర్భంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ చేంజ్ అవుతుందని, ఇందులో భాగంగానే జగిత్యాల మాస్టర్ ప్లాన్ 2009లోనే ముగిసిందన్నారు. ఈ ఇష్యూపై రైతులను, ప్రజలను ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టి రచ్చ రచ్చ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ చేంజ్ చేయాలని అన్నారని, ఇప్పుడేమో మళ్లీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ను ఇప్పుడు సరి చేశామన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 238 (15.12.2022) డ్రాఫ్ట్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసి.. మళ్లీ కొత్త ప్లాన్ కోసం సలహాలు, సూచనలు తీసుకుని సరి చేస్తామని హామీ ఇచ్చారు.