దక్షిణ మధ్య రైల్వేకు రూ. 7,222
గతేడాది రూ.7,024 కోట్ల కేటాయింపులు
ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకే తాజా బడ్జెట్‌లో ప్రయారిటీ
కాజీపేట–- బల్లార్షా థర్డ్ లైన్‌కు రూ.475 కోట్లు
ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇస్తలేదు: జీఎం గజానన్ మాల్యా
హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.7,222 కోట్లు కేటాయించారు. కొత్త ప్రాజెక్టులు లేకపోయినా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ నిధుల కేటాయింపుల్లో కోత విధించలేదు. పైగా గతేడాదితో పోలిస్తే అధికంగా ఫండ్స్ ఇచ్చారు. 2020–-21లో రూ.7,024 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.198 కోట్లు అదనంగా అలకేట్ చేశారు. తాజా బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డబ్లింగ్, థర్డ్ లైన్, బైపాస్ వర్క్స్‌కు రూ.4,238 కోట్లు, కొత్త లైన్లకు 2,195 కోట్లు, ఎలక్ట్రిఫికేషన్ పనులకు రూ.617 కోట్లు, ట్రాఫిక్ ఫెసిలిటీస్‌కు రూ.173 కోట్లు కేటాయించారు. ఇండియన్ రైల్వేకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు సెంట్రల్ బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా గురువారం వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ కేటాయింపు వివరాలను వెల్లడించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ వర్క్స్‌కు రాష్ట్రంలో 2014 నుంచి 2020 దాకా ఏటా సగటున రూ.1,110 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కానీ 2021–-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2,420 కోట్లు అలకేట్ చేశారు. అంటే 118 శాతం అధికంగా నిధులు ఇచ్చారు. ఏపీ విషయానికి వస్తే 2014 నుంచి 2020 దాకా ఏటా సగటున రూ.2,830 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.5,812 కోట్లు అలకేట్ చేశారు.
కాజీపేట – విజయవాడ థర్డ్ లైన్‌కు రూ.333 కోట్లు
రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకే బడ్జెట్‌లో ఎక్కువగా నిధులు కేటాయించారు. మనోహరాబాద్–కొత్తపల్లికి 325 కోట్లు, భద్రాచలం – సత్తుపల్లికి రూ.267 కోట్లు, మునీరాబాద్ – మహబూబ్‌నగర్ ప్రాజెక్టుకు రూ.149 కోట్లు, అక్కన్నపేట్ – మెదక్‌కు రూ.83.6 కోట్లు, కాజీపేట – బల్లార్షా థర్డ్ లైన్‌కు రూ.475 కోట్లు, విజయవాడ, కాజీపేట, రేణిగుంట, వాడి, గూటీ బైపాస్ లైన్స్‌కు రూ. 426 కోట్లు, కాజీపేట – విజయవాడ థర్డ్ లైన్‌కు రూ. 333 కోట్లు, సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు. లింగంపేట–జగిత్యాల–నిజామాబాద్ ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.20 కోట్లు, గద్వాల – రాయచూర్‌కు రూ.18 కోట్లు, చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి రూ.50 కోట్లు, కాజీపేట వర్క్‌షాప్‌కు రూ.2 కోట్లు అలకేట్ చేశారు.
సేఫ్టీకి కేటాయింపులు ఇలా..
రోడ్డు సెఫ్టీ (లెవల్ క్రాసింగ్స్, బ్రిడ్జిలు, ఆర్వోబీ/ఆర్‌యూబీ)కి రూ.672 కోట్లు, గోల్డెన్ క్వాడ్రిలెటరల్, గోల్డెన్ డయాగ్నల్ రూట్లలో రోడ్డు ఓవర్, అండర్ బ్రిడ్జిల కన్స్ట్రక్షన్కు 374 కోట్లు, ట్రాక్ రెన్యూవల్ వర్క్స్‌కు రూ.862 కోట్లు ఇచ్చారు. బీదర్–పర్లి వైద్యనాథ్–పర్భణీ, మన్మాడ్–నాందేడ్– సికింద్రాబాద్–డోన్–గుంతకల్‌లో ట్రైన్ కొల్లిజన్ అవైడన్స్ సిస్టం (టీసీఏఎస్) అమలుకు 60 కోట్లు అలకేట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు ఫ్రైట్ కారిడార్లు
సరుకు రావాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్రం ప్రతిపాదించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లలో రెండు దక్షిణ మధ్య రైల్వేకు మంజూరయ్యాయి. ఒకటి నార్త్–సౌత్ ఫ్రైట్ కారిడార్ కాగా, మరొకటి ఈస్ట్ కోస్ట్ కారిడార్. నార్త్–-సౌత్ ఫ్రైట్ కారిడార్ లైన్‌ను ఇటార్సి నుంచి నాగ్‌పూర్, బల్లార్షా, కాజీపేట, వరంగల్ మీదుగా విజయవాడ దాకా, ఈస్ట్ కోస్ట్ కారిడార్‌ను పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ నుంచి భువనేశ్వర్, వైజాగ్ మీదుగా విజయవాడ దాకా నిర్మిస్తారు.
స్పీడ్ గా పెండింగ్ పనులు
ఎంఎంటీఎస్ ఫేజ్ –2లో తన వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగట్లేదు. ఎంఎంటీఎస్ రైళ్లు త్వరగా నడిపేందుకు ప్లాన్ చేస్తున్నాం. 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. పెండింగ్ పనులు స్పీడ్ గా నడుస్తున్నాయి. ‑ గజానన్ మాల్యా, జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వే