ఇంకా ప్రారంభం కాని బియ్యం పంపిణీ

వరంగల్‍/నర్సంపేట/రాజన్న సిరిసిల్ల, వెలుగు: సంక్రాంతి పండుగ టైం దగ్గరపడింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రేషన్​ బియ్యం పంపిణీని ఇంకా మొదలుపెట్టలేదు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన బియ్యాన్ని పంపిణీ చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన బియ్యం స్టాక్‍ ను రేషన్​ షాపులకు పంపకుండా జాప్యం చేస్తున్నది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీ నుంచే బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. జనవరి నెలలో మాత్రం 10 రోజులు గడిచినా రేషన్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి అప్పాలు ఇంకెప్పుడు చేసుకోవాలంటూ డీలర్లతో గొడవకు దిగుతున్నారు. ప్రభుత్వమిచ్చే బియ్యం సరుకులు, తిండితో పాటు పిండి వంటలకు పనికొస్తాయని ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. 

కేంద్రం పంపిన 5 కిలోలే వచ్చినయ్‍

సెంట్రల్‍ గవర్నమెంట్‍ రాష్ట్రంలోని రేషన్​ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున రేషన్‍ బియ్యం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి మరో 6 కిలోలు కలిపి మొత్తంగా 11 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో  92 లక్షల రేషన్​కార్డులు ఉండగా,  కోటి 70 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 17,900 రేషన్‍ షాపుల ద్వారా ప్రతినెలా సరుకులు అందిస్తున్నారు. 2023 సంవత్సరానికి కూడా తమ తరపున 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని 15 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని రేషన్​ షాపులకు చేరింది కేంద్ర ప్రభుత్వ కోటాలోని బియ్యమే. రాష్ట్ర ప్రభుత్వ కోటా నుంచి ఇంకా బియ్యం స్టాక్​ ను రేషన్​ షాపులకు పంపించలేదు. 

రేషన్‍ షాపుల ముందు పడిగాపులు

ప్రతీనెల్లాగే జనవరిలోనూ 5వ తేదీ నుంచి రేషన్​ ఇస్తామని కార్డుదారులకు డీలర్లు చెబుతూ వచ్చారు. దాంతో జనాలు ఆ రోజు నుంచే రేషన్‍ షాపుల వద్దకు వచ్చి పోతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా స్లోగా జనవరి కోటా బియ్యాన్ని 7వ తేదీ నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తీరాచూస్తే.. ఇప్పటికీ పంపిణీ షురూ కాలేదు. ‘ఈ పాస్‍’లో  టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇలా జరిగిందని సంబంధిత అధికారులతో చెప్పిస్తున్నారు. ఇదేమీ తెలియని ఎంతోమంది లబ్ధిదారులు రోజూ రేషన్‍ షాపుల వద్దకొచ్చి పడిగాపులు కాసి ఇళ్లకు  వెళ్లిపోతున్నారు. కొందరైతే డీలర్లతో గొడవలకు దిగుతున్నారు.   

 రాజ్నన్న సిరిసిల్ల జిల్లాలో..

మచ్చుకు రాజ్నన్న సిరిసిల్ల జిల్లాను పరిశీలిస్తే..  సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా అక్కడ ఇంకా రేషన్ సరుకుల సరఫరా ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో 5,05,478 మంది లబ్ధిదారులు ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ 1,73,065 మంది ఉండగా ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. ఇందులో  కేంద్రం  5 కిలోలు, రాష్ట్రం 5 కిలోలు చొప్పున మొత్తం 10 కిలోలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోటా రేషన్ దుకాణాలకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన కోటా బియ్యాన్ని డీలర్లకు పంపలేదు. 

పేదలకు ఉచిత రేషన్..

కరోనా లాక్ డౌన్ విధించిన తర్వాత కేంద్ర సర్కారు 2020 ఏప్రిల్ 1 నుంచి దేశమంతా ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈ స్కీమ్​ ను 2023 సంవత్సరానికి కూడా పొడిగిస్తూ జనవరి 4న ప్రకటన చేసింది. ఉచిత రేషన్ తో పాటు అంత్యోదయ కార్డుల కింద 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు కింద 10 కిలోలు ఎప్పట్లానే అందించేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల డీలర్లకు బియ్యం పంపిణీకి సంబంధించిన ఆదేశాలను  జారీ చేయలేదు.

బియ్యం ఇస్తదో.. ఇయ్యదోననే టెన్షన్‍ 

తెలంగాణ ఏర్పడ్డాక కేంద్రం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 6 కిలోలు కలిపి మొత్తంగా ఒక్కొక్కరికి 11 కిలోల రేషన్‍ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా 10 కిలోలు మాత్రమే ఇస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ కోటాలో 1 కిలో బియ్యం తగ్గిందన్న మాట. ఇక జనవరి నెల విషయానికొస్తే.. అధికారులు ఎంఎల్‍సీ (గోదాం) సెంటర్ల నుంచి రేషన్‍ షాపులకు కేవలం 5 కిలోల చొప్పున మాత్రమే బియ్యం స్టాక్​ ను డీలర్లకు  పంపారు. ఇన్నాళ్లు 10 కిలోలు ఇచ్చి సంక్రాంతికి 5 కిలోల బియ్యమే ఇస్తే జనాలు గొడవలకు దిగుతారని డీలర్లు టెన్షన్‍ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇదేమీ పట్టనట్లు ‘ఈ పాస్‍’లో  టెక్నికల్‍ ప్రాబ్లం ఉందని అధికారులతో చెప్పిస్తున్నారు. బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్​ రాలేదని అప్పటివరకు ఇవ్వొద్దని ఆఫీసర్లు తేల్చి చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో పండుగ ఉండగా 5 కిలోల చొప్పునే స్టాక్‍ రావడం, పంపిణీ మొదలు కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 కిలోల బియ్యం ఇస్తుందో లేదో తెలియక అందరిలో టెన్షన్‍ నెలకొంది. 

5 కిలోలే ఇస్తమంటే గొడవలైతై

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే 10 కిలోల ఉచిత బియ్యం కోసం రేషన్‍ షాపుల ముందు జనాలు ఇప్పటికే గొడవ చేస్తున్నారు. పోయిన నెల వరకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 10 కిలోలు చొప్పున బియ్యాన్ని పంపగా.. ఈసారి 5 కిలోలే పంపింది.  టెక్నికల్‍ ప్రాబ్లం ఉందంటూ.. ఆ బియ్యాన్ని కూడా ఇప్పుడే పంపిణీ చేయొద్దని చెబుతున్నారు. ఈరోజో, రేపో పంపిణీ స్టార్ట్​ చేసినా..5 కిలోలే ఇస్తమంటే రేషన్‍ షాపుల దగ్గర గొడవలైతై. - బత్తుల రమేశ్‍, రేషన్‍ డీలర్స్​అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు

టెక్నికల్ సమస్యలున్నాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ సరుకులు రెడీగా ఉన్నాయి. రేషన్ షాప్ లలో పంపిణీకి సంబంధించిన టెక్నికల్ సమస్య ఉంది. డిసెంబర్​నెలలోనూ పంపిణీ లేట్ అయ్యింది. ఈనెలలో కొన్ని షాప్ లకు లేట్ గా బియ్యం చేరింది. ‘ఈ పాస్’ మిషన్లలో కొత్త సాఫ్ట్​వేర్ అప్ లోడ్ చేస్తున్నాం. మరో రెండు రోజులలో బియ్యం పంపిణీ చేస్తాం. - జితేందర్ రెడ్డి, జిల్లా  సివిల్ సప్లై అధికారి, రాజన్న సిరిసిల్ల 

ఇబ్బందులు పడుతున్నం

రేషన్ బియ్యం ఇచ్చి నెల రోజులు గడిచిపాయె. ప్రతినెల మొదటి వారంలోనే బియ్యం ఇచ్చేటోళ్లు. ఈ నెలల 10 రోజులు గడిచినా ఇంకా ఇస్తలేరు. డీలర్ ను అడిగితే మిషన్ పనిచేయడం లేదని చెప్తున్నడు. తినడానికి బియ్యం లేక ఇబ్బందులు పడుతున్నం. - దడిగే పుష్పలత, లబ్ధిదారు, ధర్మారం, కోనరావు పేట