ఖమ్మం లో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు

ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించినట్లుగానే నిధులు మంజూరు చేశారు. నిన్నటి బహిరంగ సభలో ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. పెద్ద తాండా, కల్లూరు, ఏదులాపురం, కల్లాల, నేలకొండపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు.

ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి అజయ్‌ వినతి మేరకు మునేరు నదిపై కొత్త బ్రిడ్జి, ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు నెలరోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.