మరో రూ. 1000 కోట్లకు టార్గెట్ ..ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల వేలానికి రాష్ట్ర సర్కార్ రెడీ

మరో రూ. 1000 కోట్లకు టార్గెట్ ..ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల వేలానికి రాష్ట్ర సర్కార్ రెడీ
  • 838 ఓపెన్ ప్లాట్లు, 363 ఇండ్ల వేలానికి రాష్ట్ర సర్కార్ రెడీ
  • నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వెంచర్లు
  • రేపు నోటిఫికేషన్, వచ్చే నెల 20 నుంచి 26 వరకు వేలం

 

హైదరాబాద్, వెలుగు:   ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. స్కీమ్​ల అమలు, ఉద్యోగుల శాలరీలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు నిధుల కొరత వేధిస్తుండడంతో ఖజానాను కాసులతో నింపేందుకు కొత్తగా మరో 3 చోట్ల ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల వేలానికి ప్రభుత్వం సిద్ధమైంది. నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్​ జిల్లాల్లో 838 ఓపెన్ ప్లాట్లు, 363 ఇళ్లు వేలం వేసేందుకు బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎలాంటి చిక్కులు లేని ఓపెన్‌‌‌‌ ప్లాట్లను/ ఇండ్లను ప్రజలు సొంతం చేసుకోవాలని కోరింది. ఈ నెల 20న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని, వచ్చే నెల 20 నుంచి 26వ తేదీదాకా  వేలం నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ప్రీ బిడ్ సమావేశాల వేదికలు, తేదీలను ఆయా జిల్లాల వెబ్ సైట్ లో ఉంచుతామంది. మొత్తం ఈ ప్లాట్లు, ఇండ్ల వేలం ద్వారా రూ.1000 కోట్లు రాబట్టాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. 


మూడు జిల్లాల్లో 838 ఓపెన్​ ప్లాట్లు 
సర్కార్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడలో 253 ఓపెన్​ ప్లాట్లు, 363 ఇండ్లు వేలం వేయనున్నారు. ఇక్కడ ప్లాట్ చదరపు గజం కనీస ధరను రూ.7 వేలుగా నిర్ణయించారు. అలాగే ఇండ్లకు నిర్మాణానికి కలుపుకుని చదరపు గజానికి కనీస ధర రూ.7 వేల నుంచి రూ.12 వేలుగా ప్రకటించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో 237 ప్లాట్లను వేలం వేయనున్నారు. ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్ కు గజం కనీస ధర రూ.6 వేలుగా, కమర్షియల్ ప్లాట్ కనీస ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం అమిస్తాన్ పూర్​ లో 348 ప్లాట్లు వేలం వేయనుండగా, గజానికి కనీస ధరను రూ.8 వేలుగా నిర్ణయించారు.  


ఇప్పటి వరకు రూ. 3,971 కోట్ల ఇన్​కం   
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన సర్కారు భూములు హాట్‌‌‌‌కేకుల్లా అమ్ముడయ్యాయి. గతంలో కోకాపేట, ఖానామెట్, ఉప్పల్ భగాయత్​లో ప్లాట్ల వేలంతో  రూ.3,404 కోట్లు రాబట్టిన ప్రభుత్వం.. మార్చి నెలలో హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని బహదూర్‌‌‌‌పల్లి, తొర్రూరుతోపాటు నల్గొండ, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్‌‌‌‌, వికారాబాద్‌‌‌‌ జిల్లాలో సర్కార్ వెంచర్లలోని ప్లాట్ల వేలం ద్వారా రూ.567.24 కోట్లను రాబట్టింది.