ఎంట్రెన్స్ టెస్టులన్నీ రద్దు ?: నేరుగా అడ్మిషన్లకు సర్కార్ మొగ్గు

క్వాలిఫైడ్ కోర్సుల్లో వచ్చిన మార్కులే ఆధారం
ఎక్కువ మంది అర్హులుంటే లాటరీ పద్ధతిలో సీటు
సీఎం వద్దకు చేరిన ఫైల్.. త్వరలోనే నిర్ణయం
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అభ్యంతరం
రూరల్ స్టూడెంట్లు నష్టపోతారని వాదన

హైదరాబాద్, వెలుగు: కరోనా ఉధృతి కారణంగా ఎంట్రెన్స్ టెస్టులన్నింటినీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. స్టూడెంట్లకు క్వాలిఫైడ్ కోర్సుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికోసం ఆఫీసర్లు ఫైల్ రెడీ చేసి సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపినట్టు తెలిసింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎంసెట్, ఎడ్ సెట్, లా సెట్, పాలిసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్ తోపాటు మిగతా ఎంట్రెన్స్ టెస్టులన్నీ రద్దు కానున్నాయి. జులై 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంట్రెన్స్ టెస్టులను ఇప్పటికే ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ క్రమంలో మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న అయోమయం స్టూడెంట్లలో నెలకొంది. దీంతో ఎంట్రెన్స్ టెస్టులు లేకుండానే అడ్మిషన్లు జరుపుతామని నిర్ణ‌యం తీసుకుంటే ఎలాంటి గందరగోళం ఉండదని రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ కీలక ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై ఈ నెల 9లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినందున, వాటిని నిర్వహించాలా.. లేక అంతకుముందు సెమిస్టర్లోని మార్కుల
ఆధారంగా గ్రేడింగ్స్ ఇవ్వాలా.. అన్నదానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకోనుంది.

టైప్ రైటింగ్, షార్ట్ హ్యండ్ వంటి టెక్నికల్ పరీక్షలను మాత్రం నిర్వహించే అవకాశం ఉంది. 4.60 లక్షల మంది స్టూడెంట్స్ ఎంట్రెన్స్ టెస్టులు లేకుండా అడ్మిషన్లు చేపడితే రాష్ట్రంలో దాదాపు 4.60 లక్షల మంది స్టూడెంట్స్ ఊరట చెందుతారు. ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్, ఈసెట్, పీజీ ఈసెట్, పీఈసెట్, లాసెట్, పాలీసెట్ కోసం స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది ఎంసెట్ కు అప్లై చేసుకున్నవారే. ఆ తర్వాత పాలిసెట్, ఐ సెట్ కు అప్లై చేసుకున్నవాళ్లున్నారు.‘‘ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే అంత సాఫీగా జరిగితే ఏంకాదు. కాని ప్రతి సెంటర్ లో స్టూడెంట్లు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది కలిసి వందల మంది ఉంటారు. ఎవరికైనా వైరస్ సోకితే సర్కారుకు చెడ్డ పేరొస్తది’’ అని ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లోని ఓ ఆఫీసర్ అన్నారు.

ఎక్కువ మంది అర్హులు ఉంటే లాటరీ

క్వాలిఫైడ్ కోర్సుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది స్టూడెంట్లకు సమాన మార్కులు వస్తే.. ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏజ్ సమానంగా ఉంటే..వారందర్నీ పిలిచి వారి ముందే లాటరీ వేసి సీటు
ఖరారు చేయొచ్చని ఆ ఆఫీసర్ అన్నారు.

బాసర ఐఐటీ ఆదర్శం

ఎంట్రెన్స్ లేకుండా జరిగే అడ్మిషన్ల ప్రాసెస్ కు బాసర ఐఐటీ ఆదర్శమని ఆఫీసర్లు చెప్తున్నారు. బాసర ఐఐటీ ప్రారంభంనుంచి టెన్త్ మార్కుల్లోమెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుపుతున్నారు. దీని వల్ల ఇప్పటివరకు ఇబ్బంది రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. బాసర ఐఐటీలో అనుసరిస్తున్న పద్ధతే అన్ని అడ్మిషన్లకు ఫాలో అయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు.

ప్రతిభకు అడ్డు కట్ట?

ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లేకుండా అడ్మిషన్లు జరిపితే స్టూడెంట్స్ ప్రతిభకు అడ్డుకట్టపడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చిన స్టూడెంట్స్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంకు లొచ్చిన సందర్భాలున్నాయి. వాళ్లకు ఈ ప్రాసెస్ తో ఇబ్బందేనని అంటున్నారు.

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అభ్యంతరం!

ఎం ట్రెన్స్ లేకుండా అడ్మిషన్లు చేపట్టే ప్రక్రియకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అభ్యంతరం చెప్తున్నట్లు తెలిసింది. క్వాలిఫైయిడ్ కోర్సుల్లోని మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తే రూరల్ స్టూడెంట్స్ న‌ష్టపోయే ప్రమాదం ఉందని చెప్పినట్టు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం