మిగులు విద్యుత్ ​ఉత్పత్తి దిశగా తెలంగాణ.!

మిగులు విద్యుత్ ​ఉత్పత్తి దిశగా తెలంగాణ.!

థర్మల్,  గ్రీన్ పవర్ ఉత్పత్తికి రాష్ట్ర  ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. జనవరి 3న  గ్రీన్ పవర్​పై   హైదరాబాద్​లో  అంతర్జాతీయ సదస్సు జరగనుంది.  విద్యుత్ ఉత్పత్తి లోటు నుంచి మిగులు విద్యుత్​ వైపుగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  ఓవైపు థర్మల్,  హైడల్  ప్రాజెక్టులు, మరోవైపు పెద్ద ఎత్తున గ్రీన్ పవర్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేసింది.  గత  బీఆర్ఎస్​ పాలకులు  వ్యక్తిగత  ప్రయోజనం కోసం చేసుకున్న  విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ఫలితంగా తెలంగాణ డిస్కమ్​లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఒప్పందాలను ఉల్లంఘించడం, నిరంతరం పర్యవేక్షణ లేకపోవడం మూలంగా రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో వేలకోట్ల అదనపు భారం పడింది. 

ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటూ.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ  సీఎం,  ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో  గ్రీన్ పవర్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయని గమనించి ప్రణాళికలు సిద్ధం చేశారు.  అమెరికా,  జపాన్  దేశాల్లో  స్వయంగా  పర్యటించారు.  గుజరాత్ రాష్ట్రంలోనూ పర్యటించి పెట్టుబడిదారులను ఆకర్షించే  ప్రయత్నం చేశారు.  హైదరాబాద్​లో  గ్రీన్ పవర్ పై అంతర్జాతీయ సదస్సుకు ముహూర్తం ఖరారు చేసి డిప్యూటీ సీఎం భట్టి ముందుకు వెళుతున్నారు. 

అప్పుల ఊబిలోకి విద్యుత్​ రంగం

విద్యుత్ రంగాన్ని గత బీఆర్ఎస్ పాలకులు అప్పుల ఊబిలోకి నెట్టేశారు.  ఈనేపథ్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం 2024 సంవత్సరంలో 15,623 మెగావాట్లు ఉన్న గరిష్ట డిమాండ్ 2030 నాటికి 22,448 మెగావాట్లకు, 2035 నాటికి 31,809 మెగావాట్ల డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసి, దానికి అనుగుణంగా ఇంధనశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతున్నది.  ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఎలాంటి కోతలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేసింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది. తెలంగాణను దేశంలోనే  పునరుత్పాదక ఇంధన (గ్రీన్ పవర్) రంగంలో అగ్రగామిగా మార్చే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం త్వరలో సమగ్ర  రెన్యువబుల్ ఎనర్జీ పాలసీని తీసుకురాబోతుంది. 2030 సంవత్సరం నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి అదనంగా మరో 20 వేల మెగావాట్లు మొత్తం 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు తయారుచేసి  ప్రజాప్రభుత్వం  ముందుకు పోతున్నది.
 
మహిళా సంఘాలకు సోలార్​ విద్యుత్ ప్లాంట్లు

మహిళా స్వయం సహాయక బృందాల సాధికారత కోసం 4,000 మెగావాట్ల సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటులో ఈ మహిళా బృందాలను ప్రజాప్రభుత్వం భాగస్వాములుగా చేస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వెయ్యి మెగావాట్ల  సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంధనశాఖ వారితో ఒప్పందం చేసుకున్నది.  తెలంగాణను  మిగులు విద్యుత్ రాష్ట్రంగా తయారు చేసి, ఇతర రాష్ట్రాలకు కరెంటును అమ్ముకునే స్థాయికి  తెలంగాణను తీసుకువెళ్లేందుకు ప్రణాళి
కాబద్ధంగా ముందుకు వెళుతోంది.  

సబ్​క్రిటికల్​ టెక్నాలజీతో భారీ నష్టం

భద్రాద్రి  థర్మల్ పవర్ ప్లాంట్ సూపర్ టెక్నాలజీతో కట్టాలని ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా  భట్టి విక్రమార్క చెప్పినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.  సబ్ క్రిటికల్ టెక్నాలజీతో  భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయడం వల్ల రావలసిన అనుమతులకు ఆలస్యం కావడంతో 20 నెలల్లో  పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు  ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది.  7,290 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం నిర్మాణం ఆలస్యం కావడం వల్ల 10,515.84 కోట్ల రూపాయలకు పెరిగింది.  సబ్ క్రిటికల్ టెక్నాలజీని అవలంబించడం వల్ల ప్రతి ఏటా177.38 కోట్లు నష్టం వాటిల్లుతుంది.

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ ఒప్పందంతో అదనపు భారం

1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ ప్రభుత్వంతో  అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్  సరఫరా చేసే విద్యుత్ కాంట్రాక్టు సామర్థ్యం 1000  మెగావాట్లు కాగా మొత్తంగా అంతకంటే తక్కువ సామర్థ్యంతో  విద్యుత్ సరఫరా జరిగింది. అయినప్పటికీ ఒప్పందంలో భాగంగా తెలంగాణ డిస్కమ్​లు  పీజీసీఐఎల్ కు ఉపయోగించని కారిడార్​పై  రూ.638.50 కోట్ల అనవసర ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చింది.  లాంగ్ టర్మ్ కారిడార్​కు  బదులుగా  షార్ట్ టర్మ్ కారిడార్ కోసం గత ప్రభుత్వం దరఖాస్తు చేసి ఉంటే ఈ మొత్తం ఆదా అయ్యేది.  వెయ్యి మెగావాట్ల కోసం ఎంఓయూ కుదుర్చుకున్నప్పటికీ 2,000 మెగావాట్ల కారిడార్​ను పొందాలని అప్పటి ప్రభుత్వం డిస్కమ్​లను  ఆదేశించింది. అదనంగా వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్  నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అదనపు 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ కారిడార్​ను  వదులుకోవడానికి  టీజీ డిస్కమ్ 2018 ఫిబ్రవరి 15న  పీజీసీఐఎల్​ను అభ్యర్థించాయి.  టీజీ డిస్కమ్​లపై  పీజీసీఐఎల్ రూ.261.31 కోట్ల రీలింక్విష్​మెంట్ చార్జీలను విధించింది. దీనిని టీజీ డిస్కమ్​లు..సెంట్రల్​ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్​ (సీఈఆర్సీ) ముందు సవాలు చేశాయి.  ఆ కేసు ఇప్పటికీ పెండింగ్​లో  ఉంది.  కారిడార్  ఉపసంహరణ టీజీ డిస్కమ్​లపై  రూ.261.31 కోట్ల  అదనపు భారాన్ని మోపడమే కాకుండా  పీజీసీఐఎల్​తో  న్యాయపరమైన వివాదాలను గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఏర్పడ్డాయి. 

పెరిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు వ్యయం

గత  బీఆర్ఎస్​ ప్రభుత్వం  యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులను తీసుకురాకుండా గాలికి వదిలేయడంతో  ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయి  ప్రజలపై అదనపు భారం పడుతున్నది. రూ. 25,099 కోట్ల  నుంచి ప్రాజెక్ట్ వ్యయం రూ. 36,131 కోట్లకు పెరిగింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభానికి సమగ్రమైన అధ్యయనం చేసి మినిస్ట్రీ ఆఫ్​  ఎన్వీరాన్​మెంట్​, ఫారెస్ట్​ అండ్​ క్లైమేట్​ చేంజ్​ (ఎంఓఈఎఫ్​ అండ్​ సీసీ)  మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకొని పబ్లిక్ హియరింగ్ నిర్వహించి పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడం జరిగింది.  800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రానికి రెండవ యూనిట్​ను అంకితం చేసింది.  2025 మే నాటికి ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఎన్టీపీసీ జార్ఖండ్​లోని పట్రాటు  పవర్ ప్రాజెక్టుకు బీహెచ్ఈఎల్​కు   కోట్ చేసిన  ధరలతో  పోల్చినప్పుడు  యాదాద్రి పవర్ ప్లాంట్​కు  బీహెచ్ఈఎల్  అధిక ధరలను కోట్ చేసింది. ఈ విధంగా కూడా ప్రజలపై అదనపు భారం పడింది. 

రైతులు, గృహాలకు ఉచిత విద్యుత్తు

విద్యుత్​ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సరిచేస్తూ ఈ ఏడాది కాలంలో ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్​ను, రైతులకు ఉచిత విద్యుత్​ అందిస్తున్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్​ను వినియోగించే నిరుపేదలు గృహ జ్యోతి పథకం ద్వారా ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. దీని ద్వారా ప్రతి పేద కుటుంబానికి నెలకు 1,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనం ప్రభుత్వం ద్వారా అందుతుంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా సుమారు 49,71, 007 కుటుంబాలు  లబ్ధి పొందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,64,57,380 జీరో బిల్లులు జారీ చేశారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు 1,336 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ‌‌‌‌‌‌‌‌ ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి 39,067 విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 198.87 కోట్లు విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి ఖర్చు చేసింది. విద్యా సంస్థలకు రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను అందించాలని ప్రణాళికలు తయారుచేశారు.

3న హరిత ఇంధనంపై అంతర్జాతీయ సదస్సు 

 రాబోయే వేసవి 2025 నాటికి 16,877 మెగావాట్లు, 2030 నాటికి 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్ అవసరాలను తీర్చడానికి ట్రాన్స్మిషన్ నెట్​వర్క్ ను బలోపేతం చేస్తున్నారు.  రూ. 335 కోట్ల అంచనా వ్యయంతో బౌరంపేటలో,  హుస్నాబాద్​లో 220 కే.వి సబ్ స్టేషన్, సీతారాంబాగ్​లో 132 కే.వి సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్​ను తీర్చడానికి 1,521 కోట్లతో 400 కే.వి, 220 కే.వి, 132 కే.వి సబ్ స్టేషన్ల నిర్మాణం, 192 పీటీఆర్ లు పెంచడం, 220కే.వి, 132కే.వి ఓల్టేజ్ లెవల్స్ లో 55 కొత్త ప్రత్యామ్నాయ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ఆకర్షించే స్థాయిలో  భాగంగా జనవరి 3న  హరిత ఇంధనంపై హైదరాబాద్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్​ను తీర్చడం, జాతీయస్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం ఈ సమావేశం ఉద్దేశం. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు,  సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్య సాధనలో భాగంగా భాగస్వాములు అందరితో కలిసి ఈ సదస్సు నిర్వహించనున్నారు.

-మారబోయిన మధుసూదన్,
డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ