అక్టోబర్ నెలాఖరులో అసెంబ్లీ!..కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించే అవకాశం

అక్టోబర్ నెలాఖరులో అసెంబ్లీ!..కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించే అవకాశం
  • ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచన 
  • కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించే అవకాశం
  • మూసీ ప్రక్షాళన, హైడ్రా, రైతు భరోసా తదితర అంశాలపై చర్చ
  • దసరా తర్వాత కేబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకునే చాన్స్  

హైదరాబాద్, వెలుగు: ఈ నెలఖారులో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం దసరా తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. వీలైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త ఆర్వోఆర్–2024 ముసాయిదాపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.కొన్ని మార్పుచేర్పులుంటే చేసి బిల్లును ఫైనల్ చేశారు. ఈ నెలఖారులోగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తీసుకొస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఆర్​ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ ఇటీవల ఆర్డినెన్స్​తెచ్చారు. దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి, చట్ట సవరణ చేయాల్సి ఉంది. 

ఫోర్త్ సిటీపైనా చర్చ..

మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో ఫామ్​హౌస్​లు, ఇండ్లు కట్టుకున్న బీఆర్ఎస్ ​పెద్దల బాగోతాన్ని అసెంబ్లీలో బయటపెట్టాలని ఆయన యోచినస్తున్నట్టు సమాచారం. అలాగే మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో దానిపైనా అసెంబ్లీలో చర్చించేందుకు సీఎం సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు, తెచ్చిన జీవోలు, చేసిన ఖర్చు, నిర్వాసితులకు డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు ఇస్తామన్న అప్పటి ప్రభుత్వ పెద్దల హామీలు.. ఇలా అన్ని అంశాలను సభ ద్వారా ప్రజలకు చెప్పాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది.

ఇక సాగు భూములకే రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ వేసి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. వాటిపైనా అసెంబ్లీలో చర్చించి, రైతుభరోసా గైడ్ లైన్స్ ను ఫైనల్​చేయాలని భావిస్తున్నది. నిజానికి ఈ దసరా నుంచే రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం తొలుత అనుకున్నప్పటికీ, గైడ్​లైన్స్​పై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాక ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అలాగే వరద నష్టంపై కేంద్రం నుంచి ఆశించిన మేర సాయం రాకపోవడంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ అసెంబ్లీలో చర్చ చేపట్టాలని సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఫోర్త్​ సిటీ ఏర్పాటుపైనా చర్చించనున్నట్టు తెలిసింది.