రింగ్ రోడ్డు పేరుతో రియల్ ఎస్టేట్​ దందా

  • 27 గ్రామాల్లో 21,517 ఎకరాలు
  • వరంగల్​ రింగ్​ రోడ్డు వెంట భూసేకరణకు రెడీ
  • ల్యాండ్ పూలింగ్ కోసం మొదలైన సర్వే
  • ముందుగా అసైన్డ్ ల్యాండ్స్​​
  • ఆందోళనలో రైతులు.. 
  • ఊరూరా నిరాహార దీక్షలు
  • భూములిస్తే బతుకుడెట్లా అని ఆవేదన
  • రోడ్డునపడనున్న లక్ష మంది రైతులు, రైతు కూలీలు
  • రాష్ట్రంలో భారీ ల్యాండ్ పూలింగ్ కు సర్కార్ రెడీ అయింది. 


 వరంగల్, వెలుగు: పచ్చని పొలాల్లో వెంచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్నది. వరంగల్​ రింగ్​ రోడ్డు వెంట 27 గ్రామాల్లో భారీ భూ సేకరణకు సిద్ధమైంది. ఆఫీసర్లు సర్వే కూడా ప్రారంభించడంతో ఆయా సర్వే నంబర్లలో భూములున్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏటా రెండు, మూడు పంటలు పండే భూములను రాష్ట్ర సర్కారు రియల్ ఎస్టేట్​ దందా కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని తెగేసి చెప్తున్నారు. ఆదివారం నుంచి గ్రామాల వారీగా దీక్షలు మొదలు పెట్టారు. సర్కారు చెప్పినట్లు ల్యాండ్​ పూలింగ్​ కోసం తమ భూములు ఇస్తే రైతుల నుంచి కూలీల స్థాయికి దిగజారుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రింగ్ రోడ్డు పేరుతో రియల్ ఎస్టేట్​ దందా

గ్రేటర్ వరంగల్ కు 10 నుంచి 20 కిలోమీటర్ల  దూరంతో  హైదరాబాద్ రోడ్డుకు ఎడమవైపు (పెద్దపెండ్యాల) నుంచి కరీంనగర్ రోడ్డును క్రాస్ చేస్తూ  ములుగు రోడ్డును కలిపేలా ఔటర్ రింగ్ రోడ్డు గతంలో నిర్మాణమైంది. ఈ ఆఫ్ రింగ్ రోడ్డు వెంట జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు,  ఓ మంత్రి అంతకుముందే ఎకరాల కొద్దీ భూములు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. కొందరు తమ అనుచరులతో వెంచర్లు చేయించి ప్లాట్లు అమ్మేశారు. ఇప్పుడు  హైదరాబాద్ రోడ్డుకు కుడివైపు నుంచి ఖమ్మం రోడ్డు, నర్సంపేట రోడ్డును క్రాస్ చేస్తూ మళ్లీ ములుగు రోడ్డును కలిపేలా మిగతా రింగ్ రోడ్డును నిర్మించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ మొదలుపెట్టకుండానే రింగ్ రోడ్డు నిర్మాణంతోపాటు దాని వెంట భూమిని కూడా డెవలప్ చేసేందుకు సుమారు కిలోమీటర్ వైశాల్యంతో  భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్థానిక గ్రామాల్లో కలకలం చెలరేగుతున్నది. బోర్లు, బావులతోపాటు ఎస్సారెస్పీ కెనాల్స్ తో నీళ్లు సమృద్ధిగా ఉండి పంటలు పండుతున్న తమ భూములను ఇవ్వబోమని రైతులు అంటున్నారు. 

ఇయ్యకుంటే గుంజుకునుడే!

కాకతీయ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (కుడా) ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఉదాహరణకు గీసుకొండ మండలం గొర్రెకుంటలో ల్యాండ్ పూలింగ్ కు అనువుగా ఉన్నట్లు గుర్తించిన మొత్తం 464.11 ఎకరాల్లో 151.05 ఎకరాల భూమి (సర్వే నంబర్ 322, 325, 327,335,374) లావుణి పట్టా భూమే. ఇలా ప్రతి గ్రామంలో కనీసం 30 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం పట్టా భూముల కంటే ముందుగా ఇలాంటి అసైన్డ్ భూములనే ల్యాండ్ పూలింగ్ లో భాగంగా బలవంతంగా సేకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూములను మీకు ఎలాగు అమ్ముకోవడానికి అవకాశముండదని, ప్రభుత్వానికి ఇస్తే వెంచర్ గా డెవలప్ చేసి సగం ప్లాట్లను ఇస్తుందని, వాటిని అమ్ముకోవచ్చని రైతులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే బలవంతంగానైనా ప్రభుత్వం తీసుకుంటుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. 

ఈ క్రమంలో ఈ నెల 6న వరంగల్ ఎనుమూముల మార్కెట్ సమీపంలోని మొగిలిచర్ల రైతులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ల్యాండ్ పూలింగ్ పేరిట తమ పంట భూములు లాక్కోవద్దంటూ ఆయనను చుట్టుముట్టి నిలదీశారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్, కుడా ఆఫీసుకు​ వెళ్లి నినాదాలతో హోరెత్తించారు.  

మూడు జిల్లాల్లో..

కుడా ల్యాండ్ పూలింగ్​లో భాగంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517  ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట లో 884.11 ఎకరాలు, పోతురాజుపల్లిలో 464.11 ఎకరాలు, ధర్మారంలో 1230.33 ఎకరాలు, మొగిలిచర్లలో 1287.16 ఎకరాలు, వంచనగిరిలో 323.18 ఎకరాలు, దూపకుంట పరిధిలో 184.12 ఎకరాలు, ఖిలావరంగల్ మండలం వసంతాపూర్ లో 887.14 ఎకరాలు, గాడేపల్లిలో 918.15 ఎకరాలు,  బొల్లికుంటలో1141.39 ఎకరాలు,  సంగెం మండలం వెంకటాపూర్​లో  216.39  ఎకరాలు, కాపులకనపర్తిలో 1032.35 ఎకరాలు, వర్ధన్నపేట మండలం చెన్నారంలో 245.20 ఎకరాలు, ఐనవోలు మండలం ఐనవోలులో 2179.14 ఎకరాలు, పంథినిలో  697.01 ఎకరాలు, పున్నేలులో 1819.32 ఎకరాలు, గరిమిల్లపల్లెలో 78.07 ఎకరాలు, కక్కిరాలపల్లిలో 243.10 ఎకరాలు,  వెంకటపూర్ లో 1607.12 ఎకరాలు,  దామెర మండల కేంద్రంలో 22.14 ఎకరాలు, జఫర్గఢ్ మండలం కూనూరులో 325.37 ఎకరాలు, రఘునాథపల్లిలో 1175.14 ఎకరాలు , ధర్మసాగర్ మండలం ధర్మాపూర్ లో 1355.27, పెద్దపెండ్యాలలో 167.06 ఎకరాలు, చిల్పూర్ మండలం నష్కల్ లో 1043.02 ఎకరాలు,  కాజీపేట మండలం రాంపూర్ పరిధిలో 384.26 ఎకరాలు, వరంగల్ మండలం కొత్తపేటలో 1056.19 ఎకరాలు, పైడిపల్లిలో 544 ఎకరాలు సేకరించబోతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.

లక్ష మంది రోడ్డున పడ్తరు

సర్కారు నయానో, భయానో భూములు తీసుకుంటే 27 గ్రామాల్లో లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు, రైతు కూలీలు రోడ్డునపడనున్నారు. ల్యాండ్​పూలింగ్​లో భాగంగా వెంచర్లు చేశాక ప్రభుత్వం 1,400 గజాల ప్లాట్​ఇస్తామని చెప్తున్నది. ఆ భూమిలో సాగు చేసే పరిస్థితి ఉండదని, ఆ ప్లాట్​ అమ్ముడు పోకపోతే పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.  తాము వ్యవసాయానికి దూరమైతే ఇక కూలీలుగా మిగిలిపోవాల్సి వస్తుందని 40 నుంచి 60 ఏండ్ల వయసున్న వాళ్లు అంటున్నారు. కుటుంబ పోషణ కోసం ఏ పని చేయాలని ప్రశ్నిస్తున్నారు. అలాగే తాము రైతుబంధు, పీఎం కిసాన్​, రైతుబీమాకు దూరం కావాల్సి ఉంటుందని చెప్తున్నారు.

సర్కారుకు భూములిస్తే రోడ్డున పడ్తం

మాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు. ఏండ్ల తరబడి వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్నం. ఇల్లు, పిల్లల చదువులు, పండుగలు, పబ్బాలు పంటమీదనే ఎల్లదీస్తున్నం. నా బిడ్డలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నరు. ఉన్న ఖర్చులన్నీ ఇంకా ముందే ఉన్నయ్‍. మా భూములు ప్రభుత్వానికిస్తే.. వచ్చే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేయలేను. దానిని అమ్ముకోలేను. నా లెక్కనే వందల మంది ఉన్నరు. ఇన్నాళ్లూ రైతుగా గౌరవంగా బతికిన నేను ఇప్పుడు ఏ పని చేయాలె? సర్కారు మాటలు నమ్మి భూములిస్తే రైతులమంతా కూలీలమైతం.
‑ కంటివాడ బాపురావు, ఆరేపల్లి, వరంగల్​ జిల్లా

సర్కారుకు పైసలు కావాలంటే బిచ్చమెత్తి ఇస్తం.. కానీ భూములియ్యం

ల్యాండ్‍ పూలింగ్‍కు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ పంట భూములు ఇవ్వబోమని వరంగల్​ జిల్లా ఆరేపల్లి, కొత్తపేట, పైడిపల్లి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఈమేరకు ఆరేపల్లి లో కుటుంబాలతో కలిసి ఆదివారం దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ పక్షాన నిలవాల్సిన  సర్కారే తమ సాగు భూములను గుంజుకుని వెంచర్లు చేస్తామనడం అన్యాయమన్నారు. లీడర్లు డబుల్‍ గేమ్‍ ఆడడం ఆపాలని వారు పేర్కొన్నారు. సిటీ డెవలప్‍మెంట్​కు, రాష్ట్రానికి ఆదాయం కావాలంటే లక్షలాదిగా ఉన్న రైతులమంతా బిచ్చమెత్తుకొని ఇస్తామన్నారు. అంతేగానీ ఎట్టిపరిస్థితుల్లో సాగు భూములిచ్చేదిలేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం కాదని మొండిపట్టుపడితే ప్రాణాలను అడ్డు పెడతామని హెచ్చరించారు. 

గతంలో హెచ్ఎండీఏ పరిధిలో ఎప్పుడూ వెయ్యి, రెండు వేల ఎకరాలకు మించి ల్యాండ్ పూలింగ్ చేయని ప్రభుత్వం.. వరంగల్ సిటీ చుట్టూ ఒకేసారి ఏకంగా 21,517 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. రింగ్ రోడ్డు నిర్మాణంతోపాటు దాని వెంట కిలోమీటర్ వైశాల్యంతో భూములను సేకరించి, వెంచర్లు చేసేలా ప్లాన్​ వేసింది. ఇందుకోసం వరంగల్ సిటీ చుట్టూ 27 గ్రామాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ చేయబోయే సర్వే నంబర్లతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.