- ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ.. నిధుల సమీకరణ స్పీడప్
- ఎఫ్ఆర్బీఎం పరిధిలో 10 వేల కోట్ల మేర అప్పు
- టీజీఐఐసీ నుంచీ నిధులు సేకరించాలని నిర్ణయం
- త్వరలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల
- నెలపాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్
- అనంతరం పంటల బీమా, రైతు బీమా, రైతు భరోసా
హైదరాబాద్, వెలుగు : రాబోయే నాలుగు నెలల్లో రాష్ట్ర రైతులకు దాదాపు రూ.43 వేల కోట్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అవుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నది. తొలుత బ్యాంకు రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. వచ్చే నెల నుంచే ప్రారంభించనున్న రైతు రుణమాఫీ ప్రక్రియ కోసం నిధుల సమీకరణను వేగవంతం చేసింది. దీంతోపాటు పంటల బీమా, రైతు బీమా స్కీమ్‌లకు కూడా ప్రభుత్వం త్వరలోనే ఫండ్స్ రిలీజ్ చేయనుంది.
వీటికితోడు రైతు భరోసా స్కీమ్ కింద ఈ సీజన్లో రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం జమ కానుంది. ఇలా రుణమాఫీ కింద రూ.31 వేల కోట్లు, రైతు భరోసా కింద దాదాపు రూ.7 వేల కోట్లు, పంటల బీమా, రైతు బీమా కింద రూ.5 వేల కోట్ల మేర రైతులకు లబ్ధి కలగనుంది.
వచ్చే నాలుగు నెలల్లోనే ఈ నాలుగు స్కీమ్‌లు అమలు చేయనున్న ప్రభుత్వం.. ఏకకాలంలో పెద్దమొత్తంలో రుణమాఫీ చేస్తున్నందున నెలపాటు రుణమాఫీ ఉత్సవాలు నిర్వహించాలనే ప్లాన్‌లో ఉంది.
మాఫీ గైడ్ లైన్స్ .. నిధుల సమీకరణ స్పీడప్
రుణమాఫీ నిధుల సమీకరణను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిధిలో రూ.10 వేల కోట్ల మేర అప్పును ఏకకాలంలో తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు తెలంగాణ ఇండస్ట్రియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) ల్యాండ్స్ ద్వారా ఇంకో రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల మేర సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం బిడ్డింగ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక రుణమాఫీ గైడ్‌లైన్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయనుంది. ఇప్పటికే మార్గదర్శకాలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
రెండు, మూడు రోజుల్లో జీవో రూపంలో విడుదల చేయనున్నట్టు సెక్రటేరియేట్ లోని ఓ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. కుటుంబంలో ఒక రైతుకు గరిష్ఠంగా రూ.2 లక్షల చొప్పున మాఫీ చేయనున్నారు. బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారివి కూడా మాఫీ చేయనున్నట్టు తెలిసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులను రుణమాఫీ నుంచి మినహాయించనున్నట్టు సమాచారం. గ్రామాల్లో రుణమాఫీ జాబితాను అంటించి.. అవసరమైతే అభ్యంతరాలు కూడా తీసుకుంటారని తెలిసింది.
పంటల బీమా, రైతు బీమాకు సై
దాదాపు 5 ఏండ్ల పాటు గత ప్రభుత్వం పంటల బీమాను పక్కన పడేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తోంది. ఇందుకోసం రైతుల ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మొత్తాన్ని కూడా సెప్టెంబర్ లోగా విడుదల చేయనుంది. రైతు బీమా విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వెళ్తోంది.
అర్హత కలిగిన రైతులందరికీ ఎంత ఖర్చయినా బీమా సౌకర్యం కల్పించేందుకు రెడీ అయింది. ఆగస్టు 15లోగా ఈ మొత్తాన్ని కూడా చెల్లించనుంది. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున అందించనున్నారు. ఈ రెండు స్కీంలకు కలిపి కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రైతాంగ సంక్షేమ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. గ్రామాల్లో నగదు ఫ్లో పెరుగుతుందని, రైతుల చేతికి లక్షల రూపాయలు చేరుతాయని చెబుతున్నారు. దీంతో అన్ని రంగాలు పుంజుకుంటాయని పేర్కొంటున్నారు.
రైతుభరోసాకు రూ.7 వేల కోట్లు
రైతుభరోసా కోసం కూడా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రైతుబంధు మాదిరి హైవేలకు, రహదారులు, గుట్టలు, వెంచర్లు, లే అవుట్లు, అసలు సాగుకు యోగ్యం కాని భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని డిసైడ్ అయింది. ఇందుకోసం అభిప్రాయ సేకరణ చేస్తోంది. జులై 15 కల్లా ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఏడాదికి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. అసెంబ్లీ లో నిర్ణయం జరిగిన దాని ప్రకారం ఈ వానాకాలం సీజన్లో అదే పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. రుణమాఫీ పూర్తి చేసిన వెంటనే రైతు భరోసా నిధుల జమను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయనుంది.