
- మహబూబాబాద్ జిల్లాలో 13,765 అప్లికేషన్లు
- పట్టించుకోని ప్రభుత్వం
మహబూబాబాద్, వెలుగు: బీసీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేస్తోంది. ఒకప్పుడు ఇది మంచి ఫలితాలు ఇవ్వగా.. గత ఐదేండ్ల నుంచి బీసీ లోన్లను సర్కారు పట్టించుకోవడం లేదు. అప్లికేషన్లు పెట్టుకుని ఏండ్లు గడిచినా అతీగతీ లేదు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు సైతం రిలీజ్ చేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 14వేల వరకు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
అప్పులు, వలసలు..
స్వయం ఉపాధి పొందాలనుకున్న బీసీ వర్గాలకు అప్పులే పెద్ద దిక్కుగా మారాయి. అధిక మిత్తీలు కడుతూ.. ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. ఒకవేళ నష్టం వాటిల్లితే.. కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన పరిస్థితి. మరికొందరు అటు ఉపాధి దొరక్క, ఇటు స్వయం ఉపాధికి రుణాలు రాక హైదరాబాద్, ముంబై ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం 2018లో మాత్రమే బీసీ లోన్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. అది కూడా ఎన్నికలు ఉన్నాయనే కారణంగానే బీసీ లోన్ల ముచ్చట తీసింది. ఆ సమయంలో మహబూబాబాద్ జిల్లాలో 13,765 మంది బీసీ రుణాలకు అప్లై చేసుకున్నారు. పోలింగ్ కు ముందు 802మందికి మాత్రమే లోన్లు జారీ చేశారు. అది కూడా సగం నిధులే ఇచ్చారు. రూ.లక్ష యూనిట్ పెట్టుకునే రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన వారికి ఎగనామం పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అర్జీదారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీనిపై జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నర్సింహస్వామిని వివరణ కోరగా.. సర్కారు నుంచి నిధులు రాగానే మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాదిలో రూ.30వేల లోపు లోన్ కోసం
అర్జీ పెట్టుకున్న వారికి ఫండ్స్ రిలీజ్ చేశామన్నారు. మిగిలిన వారికి ఇవ్వలేకపోయామన్నారు.
ఐదేండ్లుగా ఎదురుచూస్తున్నా..
నేను డ్రైవర్ ను. వాహనం ద్వారా స్వయం ఉపాధి పొందాలని బీసీ లోన్ కు అప్లై చేసిన. 2018లో అప్లై చేస్తే ఇప్పటివరకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక.. డ్రైవింగ్ వృత్తిని వదిలి, కూరగాయల వ్యాపారం చేస్తున్నా. - గట్ల శ్రీనివాస్, కొత్తగూడ
ఎన్నికల ముందే హడావుడి
బీసీ లోన్లు ఇస్తామంటూ ఎన్నికల ముందు హడావుడి చేసిన లీడర్లు, ఆఫీసర్లు ఇప్పుడు పత్తాకు లేరు. డిగ్రీ వరకు చదువుకున్న నేను ఏదైనా షాప్ పెట్టుకుని బతుకుదాం అనుకున్న. 2018లో అప్లికేషన్ ఇస్తే ఇంతవరకు లోన్ రాలేదు. వెంటనే లోన్లు మంజూరు చేయాలి. - కడుదుల రామకృష్ణ, నర్సింహులపేట