- చట్ట సవరణకు 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు
- సరిగా పనిచేయని కార్పొరేటర్లపై అనర్హత వేటు వేసేలా సవరణ?
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న రూల్‌ను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ చట్టంలో మార్పు చేయబోతోంది. డిసెంబర్‌లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇవ్వడంతో చట్ట సవరణకు ఈ నెల 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలుంటాయని సీఎంవో నుంచి గురువారం ప్రకటన విడుదలైంది. హైకోర్టు సూచన మేరకు ఇంకొన్ని అంశాలకు సంబంధించిన చట్టాలూ చేస్తామని పేర్కొంది. చట్ట సవరణలకు సంబంధించిన అంశాల ఆమోదానికి శనివారం లేదా ఆదివారం కేబినెట్ సమావేశం జరగనున్నట్టు తెలిసింది.
ఎన్నికల ప్రక్రియ 15 రోజులే
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఈ మధ్యే కొత్తగా మున్సిపల్ యాక్టు తెచ్చింది. అందులో ఇంతవరకూ ఉన్న ఇద్దర పిల్లల రూల్‌ను తొలగించింది. గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఉన్న చట్టాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఇద్దరు పిల్లల రూల్‌ను గ్రేటర్ చట్టం నుంచీ తొలగించాలని ఎంఐఎం నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత చట్టం ప్రకారం డివిజన్ల రిజర్వేషన్లు ఒక టర్మ్ వరకే వర్తిస్తాయి. కానీ వరుసగా రెండు ఎన్నికలకు అవే రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ చేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల టైమ్‌లో స్టేట్ యూనిట్‌గా కార్పొరేషన్ మేయర్ పదవికి రిజర్వేషన్ ఖరారు చేశారు. ఆ టైమ్‌లో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని జనరల్ ఉమెన్‌కు కేటాయించారు. చట్ట సవరణతో త్వరలో జరగబోయే ఎన్నికలతో పాటు తర్వాతి ఎన్నికలకూ ఇదే రిజర్వేషన్ వర్తించనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎన్నికల ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి చేయాలి. కానీ చట్ట సవరణలో 15 రోజలకు పరిమితం చేయనున్నారు. పని చేయని కార్పొరేటర్లపై అన్హరత వేటు వేసేలా చట్టంలో మార్పులు చేయనున్నారని తెలిసింది.
ఇంకొన్ని చట్ట సవరణలు
రెండ్రోజులు జరిగే అసెంబ్లీ సెషన్స్‌లో కొత్త రెవెన్యూ యాక్టును సవరించే అవకాశం ఉంది. ప్రస్తుత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసే టైమ్‌లో భూమి ధరలను తగ్గించే, పెంచే విచక్షణ అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉంది. ఆ పవర్స్‌ను సబ్ రిజిస్ట్రార్ల నుంచి తొలగించేందుకు చట్ట సవరణ చేయనున్నారు. 2018-19 కాగ్ రిపోర్టను అసెంబ్లీ ముందు పెట్టాలనీ ఆలోచిస్తోంది.