ప్రజా తెలంగాణ దిశగా అడుగులు

ప్రజా తెలంగాణ దిశగా అడుగులు

హైదరాబాద్, వెలుగు : ప్రజా తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పదేండ్లుగా ధ్వంసమైన వ్యవస్థలను గాడినపెడ్తున్నది. దేనికోసమైతే రాష్ట్రం తెచ్చుకున్నామో, అటువైపుగా ఆలోచనలను అమలు చేస్తున్నది. సొంత రాష్ట్రంలో పదేండ్లుగా నీళ్లు, నిధులు, నియమాకాల విషయంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నది. గత పాలకుల కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోగా దుబారా ఖర్చులు తగ్గించి ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నియమాకాలపై ఫోకస్ పెట్టింది. అప్పటికే కోర్టు సమస్యలు ఉన్న, ఇతర ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉన్న వాటిపై దృష్టి పెట్టి పరిష్కార మార్గాలు ఆలోచించి ముందుకు వెళ్లింది. 

దీంతో ఈ ఐదు నెలల కాలంలోనే 32 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇక నీళ్ల విషయంలోనూ నిపుణుల సహకారంతో ముందుకువెళ్తున్నది. కాళేశ్వరం డ్యామేజీ విషయంలో రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్​ఆధారంగా చర్యలు తీసుకుంటున్నది. కృష్ణా జలాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా పని చేస్తున్నది. అప్పులను తగ్గించి దుబారా ఖర్చులు, ఆడంబరాలకు పోకుండా ఆదాయాన్ని పెంచుకుంటున్నది. నిధులు సమకూర్చుకునేందుకు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పూర్తి స్థాయి బడ్జెట్​తర్వాత అన్నింటినీ సరిచేసుకోవాలని చూస్తున్నది. పదేండ్లలో ధ్వంసమైన వ్యవస్థలను సరిచేసేందుకు ఏసీబీ, డ్రగ్స్​వింగ్, ఫుడ్​సేప్టీ వంటి డిపార్ట్ మెంట్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.