ఉన్నత విద్యపై సర్కారుకు పట్టిలేదు!

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల సమస్యలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 12 యూనివర్సిటీల్లో 2,159 బోధనా సిబ్బంది,10 వేల పైచిలుకు బోధనేతర సిబ్బంది పోస్టులు నింపాల్సి ఉన్నా.. ఏడేండ్లుగా వాటిని భర్తీ చేయడం లేదు. మరోవైపు విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతినేలా.. రూల్స్​కు వ్యతిరేకంగా అర్హతలేని వీసీలుగా రిక్రూట్​అవుతున్నారు.  అర్హత కలిగిన దాదాపు 20 వేలమంది అభ్యర్థులు జేఎల్, డీఎల్​నోటిఫికేషన్ల కోసం 2013 నుంచి ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తూ.. రాష్ట్రంలో ఐదు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికైనా ఉన్నత విద్యను బలోపేతం చేసి, ప్రతి పేద స్టూడెంట్ కు నాణ్యమైన విద్య అందేలా చూడాలి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత జూనియర్, డిగ్రీ కాలేజీలు సహా యూనివర్సిటీల ముఖచిత్రం మారుతుందని అంతా భావించారు. కానీ సరిపోను నిధులు కేటాయించక, ఖాళీల భర్తీ చేపట్టక రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. లెక్చరర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జేఎల్, డీఎల్ పరీక్షలు నిర్వహించలేదు. చాలా కాలేజీలను లెక్చరర్ల కొరత వేధిస్తోంది. అర్హత కలిగిన దాదాపు 20 వేలమంది అభ్యర్థులు జేఎల్, డీఎల్​నోటిఫికేషన్ల కోసం 2013 నుంచి ఎదురుచూస్తున్నారు. పీజీలు, పీహెచ్​డీలు చేసిన యువత ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. మార్చి 9న సీఎం కేసీఆర్​వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 11,103 ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. దీంతో 20 ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లలో ఆశలు చిగురించాయి. అయితే వారిని ఏ నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్​చేస్తారనేది గందరగోళంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో  తెలుగు దేశం ప్రభుత్వం 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం చేప్టటింది. డిగ్రీ కాలేజీల్లో పనిచేయడానికి కేవలం పీజీనే విద్యార్హతగా తీసుకొని త్రీమెన్ ​కమిటీ ద్వారా దాదాపు 600 మందికు పైగా లెక్చరర్లను రిక్రూట్​చేశారు. అయితే 2007 నుంచి ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’, ‘రోస్టర్ పాయింట్లు’ పరిగణనలోకి తీసుకొని ఆర్జేడీల ద్వారా 180 పోస్టులు నింపారు. 2009 నుంచి యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ కాలేజీల్లో చేరడానికి పీజీతో పాటు పీహెచ్ డీ, లేదా సెట్, లేదా నెట్​ను తప్పనిసరి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో 3,686 మంది, డిగ్రీ కాలేజీల్లో 811 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 443 మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రకటన నేపథ్యంలో మొత్తం 4,940 మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజేషన్​పై ఆశలు పెట్టుకున్నారు. నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ప్రతిపాదన తప్పనిసరి అని ప్రభుత్వ ప్రొసీడింగ్స్​లో ఉంది. ఈ లెక్కన క్రమబద్ధీకరణకు డిగ్రీ కాలేజీల్లో సుమారు 180  మంది కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే అర్హత కలిగి ఉన్నారు. మిగతా 631 మందిని ప్రభుత్వం ఏం చేయనుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

వీడని చిక్కుముడులు 

అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు శాఖల వారీగా పంపాలని ఆర్థిక శాఖ ఇటీవల అన్ని శాఖలను కోరింది. అయితే 2016 ఫిబ్రవరిలో కూడా ఇలాంటి వివరాలే అడిగితే ఆయా శాఖలు అర్హుల జాబితాను ఆర్థిక శాఖకు పంపాయి. కొందరు అర్హత కలిగిన నిరుద్యోగులు కోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 2021 డిసెంబర్ లో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం, క్రమబద్ధీకరణపై వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆ పోస్టుల రెగ్యులరైజేషన్​కు ప్రభుత్వం ప్రకటన చేయడం తప్పలేదు. అయితే తాజాగా ప్రభుత్వ ప్రకటనతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు, అధ్యాపకుల రెగ్యులరైజేషన్​ను ఎవరూ అడ్డుకోకుండా సుప్రీంకోర్టులో ఇటీవల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

అర్హులకు ఉద్యోగాలు వచ్చేనా ?

డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకాలు ఆపేసిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ కాలేజీల్లో బోధించేందుకు అర్హత కలిగి ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జేఆర్ఎఫ్ సాధించిన వారు సుమారు 500కు పైగా ఉన్నారు. యూజీసీ నెట్ అర్హత సాధించిన వారు సుమారు వెయ్యికిపైగా, పీహెచ్​డీ లు పూర్తి చేసిన వారు అన్ని వర్సిటీల్లో దాదాపు రెండు వేలకు పైగా ఉన్నారు. అలాగే సెట్ అర్హత పొందిన వారు దాదాపు10 వేలకు పైగా ఉన్నారు. ఇలా మొత్తం దాదాపు 20 వేల వరకు అభ్యర్థులు ప్రభుత్వ నోటిఫికేషన్​ కోసం ఎదురుచూస్తున్నారు. అర్హులను రిక్రూట్​చేసేందుకు జేఎల్, డీఎల్ పరీక్షలు నిర్వహిస్తారా లేదా 20 సంవత్సరాల నుంచి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న అర్హత లేని వారిని కూడా క్రమబద్ధీకరిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సెట్ పరీక్ష నిర్హహించకనే..

2007 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు సెట్ పరీక్షను సరిగా నిర్వహించలేదు. పరీక్ష నిర్వహించని కారణంగా కాంట్రాక్టు లెక్చరర్లు అదనపు విద్యార్హత సాధించలేని పరిస్థితి తలెత్తింది. ఒకవేళ సెట్ పరీక్ష సంవత్సరానికి ఒకసారి నిర్వహించినా అర్హత సాధించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు సుమారు 8 సార్లు సెట్ పరీక్ష పెట్టే అవకాశం ఉన్నా.. 3 సార్లు మాత్రమే నిర్వహించారు. ప్రభుత్వాలు చేసిన తప్పులకు, నిర్లక్షానికి అధ్యాపకులు, నిరుద్యోగ అభ్యర్థులు బలి అవుతున్నారు. ఒకవైపు సెట్ పరీక్షకు నోటిఫికేషన్లు లేక, మరోవైపు వయసు పెరిగి రెగ్యులర్ గా విశ్వవిద్యాలయాల్లో పీహెచ్​డీ అడ్మిషన్ పొందలేక 2000 నుంచి 2007వ సంవత్సరం వరకు విధుల్లో ఉన్న ఒప్పంద అధ్యాపకుల పరిస్థితి వర్ణనాతీతం. ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా వీరు వయోభారం కారణంగా పోటీ పడటం కష్టమే. 2000 సంవత్సరంలో రిక్రూట్​అయిన డిగ్రీ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు కేవలం నెలకు రూ.5 వేలతో పనిచేశారు. కుటుంబ పోషణ భారమైనా ఉద్యోగాన్ని నమ్ముకొని ఇప్పటివరకు పనిచేస్తూనే ఉన్నారు. 2009లో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బేసిక్ స్కేల్ ప్రకారం కొంతమేర జీతాలు పెరిగాయి. ఏటా సెట్ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగానే కాంట్రాక్టు లెక్చరర్లు అదనపు విద్యార్హత సంపాదించలేక రెగ్యులరైజేషన్​కు అర్హత సాధించే అవకాశాలు కోల్పోయారు. కాబట్టి అలాంటి వారిని అనర్హులుగా భావించడం సరికాదు.

ఖాళీలు నింపాలె

రాష్ట్రంలో పీజీ పూర్తిచేసిన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. వారందరి కోసం ప్రభుత్వం వెంటనే సెట్ నోటిఫికేషన్ వేయాలి. గత పదేండ్ల నుంచి సెట్​ నిర్వహించని కారణంగా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి అదనపు అర్హత లేని ఒప్పంద అధ్యాపకులకు వారి సీనియారిటీ సర్వీసులను పరిగణనలోనికి తీసుకొని ఆదుకోవాలి. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అర్హత కలిగిన వారిని వెంటనే క్రమబద్దీకరించాలి. జేఎల్, డీఎల్ పరీక్షలను వెంటనే జరిపించి పూర్తి స్థాయిలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఖాళీలను నింపాలి.  
- డా. ఇస్తారి, అసోసియేట్ ప్రొఫెసర్, కేయూ