- వ్యవసాయ విద్యుత్‌కు కోతలు
- ఒకేసారి పంపులు ఆన్ చేస్తుండడంతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
- లో ఓల్టేజీ సమస్యతో దెబ్బతింటున్న మోటార్లు
- నాట్ల సీజన్ కావడంతో ఇబ్బంది పడుతున్న రైతులు
మహబూబ్‌నగర్, వెలుగు: వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేవలం ఎనిమిది గంటలే ఇస్తున్నది. అది కూడా పగటిపూట ఒకే టైమ్‌కు రాష్ట్రమంతా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతున్నది. యాసంగి సీజన్ కావడంతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను కట్టడి చేసేందుకు డిస్కంలు ఈ నెల18 నుంచి వ్యవసాయానికి కోతలు పెడుతున్నాయి. 15 గంటలు ఇస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో 8 నుంచి 10 గంటలకు మించి త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం రాష్ట్రమంతా వరినాట్లు ముమ్మరంగా సాగుతుండడంతో రైతులంతా ఒకే సమయంలో మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు పెడుతున్నారు. దీంతో ప్రెజర్ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు ఎక్కడికక్కడ కాలిపోతున్నాయి.
నిజానికి ఈ ఏడాది వానకాలం సీజన్‌నుంచే వ్యవసాయానికి కరెంట్ కోతలు అమలవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా 8 నుంచి 12 గంటలకు మించి కరెంట్‌ఇవ్వడం లేదు. కానీ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సీఎం కేసీఆర్ మొదలుకొని ఎమ్మెల్యేల దాకా అధికార పార్టీ లీడర్లంతా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు.
నాట్ల టైంలో ఇక్కట్లు
ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బోర్లు, బావులు, కాల్వల కింద నార్లు పోసుకున్న రైతులు కొద్దిరోజులుగా వరినాట్లు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉదయం పది కల్లా కూలీలు వచ్చేసరికి ఇరువాలు దున్ని మడులను రెడీ చేయాల్సి ఉంటుంది. రాత్రి పూట నీళ్లు పారిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ పగటిపూట మాత్రమే త్రీఫేజ్ కరెంట్ఇస్తుండడంతో పొలాలకు నీళ్లు పెట్టేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అసలే గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉందని, ఉదయం పనికివచ్చేసరికి నారుమడులను సిద్ధం చేయలేకపోతున్నామని వాపోతున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నయ్
యాసంగి సీజన్ కావడంతో విద్యుత్డిమాండ్ను కట్టడి చేసేందుకు డిస్కంలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర సర్కారు పర్మిషన్తో ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు అమలు చేస్తున్నాయి. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్‌డీసీ)కి చెందిన లోడ్ మానిటరింగ్ రెగ్యులేషన్ కమిటీ (ఎల్‌ఆర్‌ఎంసీ) నుంచి జిల్లాల్లోని అధికారులకు ఆదేశాలు రావడంతో కొన్ని ఏరియాల్లో ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు, మరికొన్ని ఏరియాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేస్తున్నారు. దీనిపై రోజువారీగా సబ్ స్టేషన్లలోని ఆపరేటర్లకు మెసేజ్‌లు వస్తున్నాయి.
నిజానికి అగ్రికల్చర్ సెక్టార్‌కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల దాకా, మళ్లీ రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల దాకా.. అంటే రోజుకు దాదాపు 15 గంటలు త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేయనున్నట్లు ఇటీవల ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఉదయం పూట మాత్రమే త్రీ ఫేజ్ కరెంటు సప్లై చేస్తుండటంతో రైతులందరూ ఒకే సారి బోర్ మోటార్లను ఆన్ చేస్తున్నారు. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై ప్రెజర్ పెరిగి అవి కాలిపోతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఫీజులు కొట్టేస్తున్నాయి. లైన్లు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. లో వోల్టేజ్‌తో మోటార్లు కాలిపోతున్నాయి.
ఈ ట్రాన్స్ఫార్మర్ మహబూబ్‌నగర్ జిల్లా రూరల్ మండలం బొక్కలోనిపల్లి గ్రామంలోనిది. 63 కేవీ కేపాసిటీ ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ను రైతులు రాఘవేందర్, రాములు, ఆంజనేయులు, నాగన్న కలిసి వేయించుకున్నారు. ఉదయం పూట త్రీ ఫేజ్ కరెంటు సఫ్లై ఉండడంతో అందరూ ఒకే సారి మోటార్లు ఆన్చేస్తున్నారు. దీంతో శనివారం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం లైన్‌మన్ వచ్చి రిపేర్ చేసి వెళ్లాడు. ఇందుకు రైతులు రూ.6,500 వరకు ఖర్చు పెట్టుకున్నారు. కానీ రిపేరు చేసిన అరగంటకే ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి.
కరెంట్ కోతలకు నిరసనగా ఈ నెల 25న మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి ఆలయం దగ్గర్లో ఉన్న 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అమ్మాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. కరెంట్ కోతల వల్ల రైతులందరూ ఒకేటైంలో మోటార్లు ఆన్చేయాల్సి వస్తున్నదని, దీని వల్ల లోవోల్టేజీ సమస్య తలెత్తుతున్నదని వాపోయారు. మాటిమాటికీ ఫ్యూజ్‌లు పోతున్నాయని, ఫిర్యాదు చేసినా లైన్‌మన్ వచ్చి రిపేర్లు చేయడం లేదని ఆరోపిస్తూ సబ్ స్టేషన్ గేట్ ఎదుట బైఠాయించారు. ఎస్ఐ వచ్చి ఏఈ, అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.
ఆరు గంటలే ఇడుస్తున్నరు
నాకున్న రెండెకరాల్లో వరి పెడ్తున్న. తుకాలు కూడా పోసుకున్న. నాట్లు వేయిద్దామంటే కరెంట్ సమస్య ఉన్నది. రోజులో ఆరు గంటలు కూడా సక్కగా ఇడుస్తలేరు. నాట్లు వేయడానికి చాలా కష్టమైతాంది. ఇప్పుడేసిన పంట ఎండాకాలంలో
చేతికొస్తది. కోతలు ఇట్లనే ఉంటే పంట ఎండిపోయి లాస్ వస్తది. - మన్యపు రెడ్డి, వర్నే, అడ్డాకుల మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
మోటార్లు కాలిపోతున్నయ్
రెండెకరాల్లో వరి పెడ్తున్న. మా ఏరియాలో కాలువలు లేవు. బోర్లే దిక్కు. కరెంటు ఉంటేనే బోర్లు ఆన్ చేసుకొని పొలాలకు నీళ్లు పారించుకుంటం. కానీ ఇప్పుడు త్రీఫేజ్ కరెంట్‌కు కోతలుపెడ్తు న్నరు. రైతులందరూ ఒకేసారి మోటార్లు ఆన్‌చేస్తే ట్రాన్స్ఫార్మర్లలో ఫ్యూజులు కొట్టి మోటర్లు కాలిపోతు న్నయ్. కోతలు ఎక్కువైతే నా పంట మొత్తం ఎండిపోతది. - వెంకట్రామి రెడ్డి, వర్నే, అడ్డాకుల మండలం