కేంద్రం వైఖరి కారణంగా రాష్ట్రం అనేక ఇబ్బందులు పడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కేంద్రం తీరుతో రాష్ట్రం 3లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ ఆరోపించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్న స్థాయిలో కూడా కేంద్రం పనిచేయడం లేదని విమర్శించారు. కేంద్రం తీసుకొస్తున్న చెత్త పాలసీల కారణంగా రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటాలను ఇంకా తేల్చకపోగా.. మత విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో ముందుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 87వేలుగా ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం 2 లక్షల 78వేలకు చేరిందని అన్నారు. జీఎస్డీపీ సైతం 5లక్షల కోట్ల నుంచి 11.50 లక్షల కోట్లుకు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి మనిషి పుట్టుక నుంచి చావు దాకా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సీఎం వరాల జల్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని 481 గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ప్రకటించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు రూ.40 కోట్లు.. మణగూరు, ఇల్లందులకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఇంజనీరింగ్ కాలేజీగా మారుస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సైతం ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తామని చెప్పారు.