- మొదటి స్థానంలో ఒడిశా..రెండో స్థానంలో యూపీ
- మూడో స్థానంలో ఏపీ
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో రాష్ట్రం వెనుకబడింది. ఇటీవల కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసిన లెక్కల్లో ఈ విషయం తేలింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలులో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. ఒడిశా మొదటి స్థానంలో నిలువగా.. ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, గుజరాత్ నాలుగో స్థానంలో నిలిచాయి. దేశంలో ఆకలిచావులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ఈ చట్టాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పబ్లిక్ డిస్టిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్)ను మరింత అభివృద్ధి చేసి రేషన్ అందించాల్సి ఉంది. రేషన్ పంపిణీ, సివిల్ సప్లయ్స్ విభాగం నిర్వహణ తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఆహార భద్రతా ప్రమాణాలను రూపొందిస్తారు. అదేవిధంగా లబ్ధిదారుల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం, రేషన్ కార్డు మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పౌష్టికారం అందించడం, ప్రతి లబ్ధిదారుకు ఇంటికి వెళ్లి మరీ రేషన్ అందించడం, రేషన్ షాపులను విస్తృతంగా అందుబాటులోకి తేవడం, వన్ నేషన్ వన్ రేషన్ అమలు చేయడం, ఇతర రాష్ట్రాల నుంచి బతుకు దెరువు కోసం వచ్చే వారికి కూడా సరైన ఆహార భద్రత కల్పించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రాల సివిల్ సప్లయ్స్ సదస్సులో 2022 సంవత్సరానికి గాను రాష్ట్రాలకు ఆహార భద్రత ర్యాంకులను కేంద్రం ప్రకటించింది.