- రాష్ట్ర సర్కారు అంచనా వేసుకున్న గ్రాంట్లు రూ.10,525 కోట్లు
- కేంద్రం నుంచి డిసెంబర్ నాటికే వచ్చినవి రూ.12,018 కోట్లు
- మిగతా 3 నెలల్లో మరిన్ని నిధులు!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం అంచనా కంటే కేంద్రం నుంచి రెండేళ్లుగా ఎక్కువ గ్రాంట్ఇన్ ఎయిడ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఫండ్ వస్తోంది. దీంతోపాటు జీఎస్టీ బకాయిలను కూడా కేంద్రం ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు రిలీజ్ చేస్తోంది. కాగ్ రిలీజ్ చేసిన రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఫైనాన్షియల్ఇయర్లో డిసెంబర్ నాటికే రాష్ట్ర సర్కారు బడ్జెట్‌లో వేసుకున్న అంచనాల కంటే 14% అదనంగా గ్రాంట్లు వచ్చాయి. సోమవారం 2021–22 కేంద్ర బడ్జెట్ఉండటంతో ఈసారి కూడా గ్రాంట్లు ఎక్కువే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలకు కేంద్రం మొండిచెయ్యి చూపుతోందన్న ఆరోపణలు తప్పు అని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని ఎక్స్పర్టులు అంటున్నారు.
పోయినేడాది 41 శాతం ఎక్కువ..
2020–21లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.10,525.36 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే డిసెంబర్ నాటికే రూ.12,018 కోట్లు (114%) ఫండ్స్ వచ్చాయి. ఫైనాన్షియల్ ఇయర్లో మిగిలిన 3 నెలల్లో మరిన్ని నిధులు వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఇక 2019–20 బడ్జెట్‌లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.8,177.75 కోట్లు వస్తాయని అంచనా వేసుకోగా.. కేంద్రం రూ.11,598 కోట్లు (141.83%) ఇచ్చింది. జీఎస్టీ పరిహారం కింద రావాల్సిన మొత్తాన్ని లోన్ల రూపంలో తీసుకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది. కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఇన్కంపై ప్రభావం పడటంతో ఎఫ్ఆర్బీఎం పరిమితిలో ప్రత్యేక వెసులుబాటును కొనసాగించే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు.