దాడి సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఇంత జరిగిందా..? కీలక విషయాలు బయటపెట్టిన పనిమనిషి

ముంబై: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న సైఫ్ అలీఖాన్ పని మనిషి స్టేట్మెంట్‎ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పని మనిషి కీలక విషయాలు వెల్లడించింది. నిందితుడు మొదట సైఫ్ చిన్న కుమారుడు జేహ్‌ నిద్రిస్తోన్న గదిలోకి వచ్చాడు. అప్పుడు తాను గదిలోనే ఉండగా.. నిందితుడు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నిందితుడికి నాకు మధ్య వాగ్వాదం జరిగింది. 

అతడు నాపై దాడి చేసేందుకు రావడంతో గట్టి కేకలు వేశాను. వెంటనే తెరుకున్న సైఫ్ అలీఖాన్ కుమారుడి గదిలోకి వచ్చాడు. నిందితుడిని పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగగా.. నిందితుడు కత్తితో సైఫ్ అలీఖాన్‎ను పొడిచి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‎ను లీలావతి ఆసుపత్రికి తరలించారని పని మనిషి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. నాతో పాటు మరో ఇద్దరు పని మనుషులకు సైతం గాయాలు అయ్యాయని తెలిపారు.

ALSO READ | అలా చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుందనుకుంటా: డైరెక్టర్ సుకుమార్

ఇదిలా ఉండగా.. సైఫ్ అలీఖాన్‎పై దాడి చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ ఇంట్లో సీసీ కెమెరాల్లో నిందితుడి కదలికలు రికార్డ్ అయ్యాయి. దాడి చేసి పారిపోతున్న నిందితుడి సీసీ ఫుటేజీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా ముంబైలోని ప్రభావతి ప్రాంతంలో నిందితుడిని గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై గుర్తు తెలియని నిందితుడు కత్తితో ఎటాక్ చేశాడు. బుధవారం (జవనరి 15) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది.