రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో జనం జాడేది?

  • స్టేజీ మీదకు రాకుండానే వెళ్లిపోయిన ఎమ్మెల్యే వనమా, కలెక్టర్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు జానం రావడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ఫిష్ ఫెస్టివల్​కు పట్టుమని పది మంది కూడా రాలేదు. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగైదు ఫిష్ ఫుడ్ స్టాల్స్​ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్​ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఒక్క ఏడాదిలోనే వందశాతం సబ్సిడీ కింద1.77 కోట్ల చేప పిల్లలను 743 చెరువుల్లో వేశామన్నారు.

ఫిష్​ఫుడ్ ఫెస్టివల్​లో ఉత్తమ వంటకాలను సెలెక్ట్​చేసి నగదు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఫిష్, రొయ్యలతో చేసిన బిర్యానీ, స్నాక్స్​ను ఎమ్మెల్యే, కలెక్టర్, ప్రజాప్రతినిధులు రుచి చూశారు. ఎంతకూ ప్రజలు ఫిష్​ఫెస్టివల్​కు రాకపోవడంతో స్టేజీ కింద కూర్చున్న ఎమ్మెల్యే, జడ్పీ వైస్ చైర్మన్​కంచర్ల చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్​దిండిగాల రాజేందర్, చుంచుపల్లి ఎంపీపీ బదావత్ శాంతి కలెక్టర్​తో కలిసి స్టాల్స్​వద్దకు వెళ్లి స్టేజీ మీదకు రాకుండానే వెళ్లిపోయారు. స్టేజీ కళా ప్రదర్శనలకే పరిమితమైంది.