దేవరగట్టులో యధావిధిగా సాగిన కర్రల సమరం

దేవరగట్టులో యధావిధిగా సాగిన కర్రల సమరం

నిషేధం పట్టించుకోకుండా ఉత్సవానికి తరలివచ్చిన భక్తులు

కర్రల సమరంలో పలువురికి గాయాలు

కర్నూలు: దసరా సందర్భంగా దేవరగట్టులో కర్రల సమరం యధావిధిగా సాగింది. కరోనా నిబంధనల పేరుతో ఉత్సవాలను నిషేధించి ఏకాంతంగా కళ్యాణోత్సవాలు జరపాలన్న అధికారుల ప్రయత్నాలను ప్రజలు అడ్డుకున్నారు. రాత్రి 11 తర్వాత ఒక్కసారిగా వచ్చిన భక్తులను నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. కరోనా ఆంక్షలు కర్రల సమరాన్ని ఆపలేకపోయాయి. దేవరగట్టులో ఏటా నిర్వహించే బన్ని ఉత్సవాన్ని రద్దు చేశామని అధికార యంత్రాంగం ప్రకటించినా గ్రామస్థులు లెక్కచేయలేదు. ఆనవాయితీ ప్రకారం కర్రల సమరం జరిగింది. డజన్ల సంఖ్యలో భక్తుల తలలు పగిలాయి.

రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన ఉత్కంఠ

పూర్వం నుండి అనాదిగా వస్తున్న సంప్రదాయం ఈసారి కొనసాగుతుందా.. లేదా అన్న ఉత్కంఠ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఓ వైపు కరోనా నిబంధనలు. ఇంకో దిక్కున పోలీసుల ఆంక్షలు. ఉత్కంఠ రేపినా ఎప్పటిలానే బన్ని ఉత్సవం యథావిధిగా జరిగిపోయింది. కేవలం గంట వ్యవధిలో దేవరగట్టు కొండపైన పరిస్థితి మారిపోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి కొద్దిసేపు ముందు  వందల మంది కర్రలు పట్టుకుని దేవరగట్టు కొండవైపు రావడం చూసి పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. భక్తులు కర్రలతో పోలీసులను తోసుకుంటూ ఆలయ ప్రాంగణానికి దూసుకుని వచ్చేశారు. ఓ వైపు తోపులాటలు జరుగుతుంటే.. సందు దొరికిన కాడల్లా భక్తులు కర్రలతో కేకలు వేసుకుంటూ ఆలయం ప్రాంగణంలోకి చొచ్చుకుని వెళ్లిపోయారు. ఒక దశలో లాఠీ చార్జి చేసినా భక్తులు లెక్క చేయకుండా ముందడుగు వేశారు. అధికారుల ఆంక్షల ప్రయత్నంలో భాగంగా కర్రలు తీసుకురావడం తగ్గినా.. అర్ధరాత్రి ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం తర్వాత  ఉత్సవ మూర్తులను కొండపై నుంచి కిందకు తీసుకు వచ్చారు. కొండ కింద వేచి ఉన్న భక్తులకు తోడు.. దూరంగా పొదల్లో .. గుట్టలపై వేచి ఉన్న వారంతా తరలిరావడంతో దేవరగట్టు ఆలయ ప్రాంగణం జన సంద్రంగా మారిపోయింది. కొండ పైన దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకుని సింహాసనం కట్ట వద్దకు..  అక్కడి నుంచి పాదాల కట్ట, రాక్షస పడ, అక్కడి నుంచి శమీ వృక్షం దగ్గరకు  తీసుకువెళ్లి అక్కడ పూజలు చేశారు. తెల్లవారిన తర్వాత తిరిగి సింహాసనం వద్దకు చేరడంతో బన్ని ఉత్సవం ముగిసింది.  ఈ  ఉత్సవంలో కర్రలు తగిలి, దివిటీలు కాలి, దాదాపు 40 మంది దాకా గాయాలపాలయ్యారు. ఇద్దరికి తలపై తీవ్రంగా రక్తగాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.