న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, యూఎస్ఫెడ్ నిర్ణయంపై సస్పెన్స్, భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్ మంగళవారం1,064 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.92 లక్షల కోట్లు పడిపోయింది. వరుసగా రెండో రోజు పతనంతో, 30 షేర్ల బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1.30 శాతం తగ్గి 80,684.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,136.37 పాయింట్లు క్షీణించి 80,612.20 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 332.25 పాయింట్లు పతనమై 24,336 వద్దకు చేరుకుంది. బీఎస్ఈ- లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,92,644.06 కోట్లు తగ్గి రూ.4,55,13,913.24 కోట్లకు ( 5.36 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది.
బుధవారం జరగనున్న యూఎస్‌ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశానికి ముందు పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని ప్రభుదాస్ లీలాధర్ ఎనలిస్ట్ విక్రమ్ అన్నారు. జపాన్, ఇంగ్లండ్సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీరేట్లపై నిర్ణయాలను ప్రకటించనున్నాయని చెప్పారు. సెన్సెక్స్ప్యాక్లోని అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.65 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం పడిపోయింది.
అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో 2,442 స్టాక్‌లు క్షీణించగా, 1,576 లాభపడ్డాయి. రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయిందని, రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఆసియా మార్కెట్లన్నీ డౌన్
ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై హాంకాంగ్ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐరోపా మార్కెట్లు చాలా వరకు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. వాల్‌స్ట్రీట్ సోమవారం చాలా వరకు లాభాలతో ముగిసింది. రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి క్షీణించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం రూ. 278.70 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.50 శాతం క్షీణించి 73.58 డాలర్లకు చేరుకుంది. మార్కెట్లో అస్థిరత ఉన్నప్పటికీ, ఈ వారంలో ఎనిమిది కొత్త ఐపీఓల సబ్‌స్క్రిప్షన్ మొదలవుతున్నదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎనలిస్టు సిద్ధార్థ్ ఖేమ్కా అన్నారు. సెన్సెక్స్ సోమవారం 384.55 పాయింట్లు క్షీణించి 81,748.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100.05 పాయింట్లు నష్టపోయి 24,668.25 వద్దకు చేరుకుంది.