మేడ్చల్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య 

మేడ్చల్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య 

మేడ్చల్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇంజినీరింగ్ విద్యార్థి కథ విషాదాంతమైంది. డీ పోచంపల్లిలోని కుడి కుంటలో రాథోడ్ రోహిత్ అనే విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన రాజేందర్ కుమారుడు రాథోడ్ రోహిత్.. దుండిగల్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్(IARE) కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్నాడు. ప్రతిరోజూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండేవాడు. అయితే.. ఈనెల 13వ తేదీ నుంచి రోహిత్ సెల్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో కంగారు పడిన రోహిత్ తల్లిదండ్రులు ఈనెల 16వ తేదీన కుమారుడు ఉంటున్న ప్రైవేటు హాస్టల్ కు వెళ్లి చూడగా కనిపించలేదు. కాలేజీకి కూడా వెళ్లి ఆరా తీయగా.. రెండు రోజుల నుంచి కాలేజీకి రావడం లేదని చెప్పారు. వెంటనే రోహిత్ బాబాయి రాథోడ్ గజేందర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా..డీ పోచంపల్లిలోని కుడి కుంటలో రోహిత్ మృతదేహాన్ని గుర్తించారు. అయితే.. స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా రోహిత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుమారుడు మృతితో రోహిత్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. మరోవైపు నిన్నటి వరకూ తమతో కలిసి ఉన్న ఫ్రెండ్ రోహిత్ ఇక లేడని తెలిసి స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రోహిత్ మరణానికి దారి తీసిన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.