కాకతీయ కాలువలో పడ్డ హెడ్కానిస్టేబుల్ డెడ్బాడీ లభ్యం

ఆగస్టు 25వ తేదీన కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కాలువలో పడ్డ హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) డెడ్ బాడీ లభించింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులోని కాకతీయ కెనాల్ లో ఆదివారం రోజు (ఆగస్టు 27న) కొట్టుకుపోతున్న మల్లయ్య మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటికి తీయించారు. పోస్టుమార్టం కోసం కరీంనగర్ మార్చురీకి తరలించారు. 

అసలేం జరిగిందంటే..?  

కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ లోని  భగత్ నగర్ లో  నివాసం ఉంటున్న మల్లయ్య పెద్దపల్లి జిల్లాలో డ్యూటీ చేస్తున్నారు. ఆగస్టు 25వ తేదీ శుక్రవారం రోజు పొద్దున ఇంటికి వచ్చిన మల్లయ్య బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని, ఎస్పీ ఆఫీస్​లో పని ఉందని భార్య హేమలతకు చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే  అతడి స్నేహితులకు ఫోన్లు చేసి సమాచారాన్ని అందించారు. అయినా ఎలాంటి సమాచారం దొరకలేదు. దీంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఆగస్టు 25వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​మండలంలోని అలుగునూర్ శివారులో గల కాకతీయ కెనాల్​హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లాడు మల్లయ్య. కాల్వలో చేతులు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి అతన్ని కాపాడేందుకు నీటిలో తాడు వేసినప్పటికీ పట్టుకోలేదు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో  నీటిలో కొట్టుకుపోయాడని తెలిపారు. ఈ విషయం పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. 

కాకతీయ కాలువలో పడ్డ తర్వాత హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాలువ నీటి విడుదలను ఆపేందుకు ఇరిగేషన్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. హెడ్ రెగ్యులేటరీ గేటు మూసుకోకపోవడంతో నీటి ప్రవాహం కొనసాగింది. కాకతీయ కాలువ నీటి విడుదలను ఆపేందుకు గేటుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య.. ప్రస్తుతం మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు గన్ మన్ గా ఉన్నారు. మల్లయ్యకు భార్య హేమలత, ఇద్దరు కూతుళ్లు శ్రీజ, కీర్తన ఉన్నారు.