ధర్మపురిలో టెన్షన్.. టెన్షన్.. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తెరవనున్న అధికారులు 

  • గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి శాసనసభ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను సోమవారం ఉదయం 10 గంటలకు అధికారులు తెరవనున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను ఏప్రిల్ 10వ తేదీన అధికారులు తెరవనున్నారు. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించిన అడ్లూరి.. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు.

ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు తమ తమ వాదనలను హైకోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరవనున్నారు. అనంతరం అందులోని కీలక డాక్యుమెంట్లను నిర్ణిత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. 268 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో 17 సీ డాక్యుమెంట్స్ కీలకం కానున్నాయి.

జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ఈవీఎంలను భద్రపర్చిన వీఆర్కే కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేయనున్నారు. అయితే వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేయనుండటంతో స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.