ఆధునిక తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగధనుల అమరత్వమే. బాంచన్.. కాల్మొక్త అంటూ ఊడిగం చేసిన చేతులే.. వెట్టి చాకిరీకి, దొరల దోపిడీలకు వ్యతిరేకంగా కొట్లాడినయి. ఆ మట్టి మనుషుల పోరాటం ఎప్పుడూ ఈ తరానికి స్ఫూర్తిగానే నిలుస్తుంది. నిజాం నిరకుంశ పాలనకు వంది మాగధుల లాగా దొరలు, దేశ్ముఖ్పెత్తందార్లు పని చేసేవారు. ఇష్టారాజ్యంగా ప్రజల ధన, మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ.. ఎదురు తిరిగిన వారిని హతమార్చేవారు. శతాబ్దాల ఫ్యూడల్ పాలన తెలంగాణ ఆర్థిక స్థితిని నిలువరించింది. ప్రజలు నిరక్షరాస్యత, దిక్కులేని తనంతో అల్లాడిపోయారు. భూములు బీడు వారాయి. కాలంతోపాటు వచ్చే వానలకో, చెరువుల మీదనో ఆధారపడి ఏదో కొంత ధాన్యం పండించేవారు. తెలంగాణ ప్రజలకు పౌరహక్కులు గాని, ప్రజాస్వామ్య హక్కులు గానీ లేవు. ఆ సమయంలోనే తమ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిరక్షించుకునేందుకు ఆంధ్రా జన సంఘం అనే సాంస్కృతిక సంస్థను స్థాపించుకున్నారు. కాలక్రమేణా అది ఆంధ్రమహాసభగా1930లో జోగిపేటలో పేరు మార్చుకున్నది.
దేశ్ముఖ్ ల ఆగడాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా(ప్రస్తుతం జనగామ జిల్లా) కడివెండి గ్రామంలో గొర్రె కాపర్ల కుటుంబంలో 1927 ఏప్రిల్3న దొడ్డి కొమురయ్య పుట్టారు. నిజాం పాలనలో నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు దారుణంగా ఉండేవి. భూమి, పంట, పశువులు, పారే నీళ్లపైనా జనాలకు హక్కులు ఉండేవి కావు. పటేల్, పట్వారీల దుర్మార్గాలతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. తెలంగాణ యువత ఆంధ్రమహాసభ నాయకత్వంలో గ్రామాల్లో జైత్ర యాత్ర సాగిస్తూ ఫ్యూడల్శక్తుల దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటాల్లో పాల్గొనేవారు. విసునూరు గ్రామానికి చెందిన దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి చుట్టూ ఉన్న గ్రామాల అమాయక ప్రజల భూముల్ని ఆక్రమించాడు. ఎదురు తిరిగిన వారిని గుండాలతో, నిజాం పోలీసుల అండతో దాడులు చేయించేవాడు. ఆంధ్ర మహాసభలో చురుగ్గా పనిచేస్తున్న చాకలి అయిలమ్మ పంటను తన గూండాలతో లూటీ చేయించాడు. ఎదురు తిరిగిన ఆంధ్ర మహాసభ కార్యకర్తలను అరెస్ట్ చేయించి చిత్ర హింసలకు గురిచేశాడు. పోలీసుల చిత్రహింసలు, విసునూరు దేశ్ముఖ్ఆగడాలు పాలకుర్తి గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్కల జనంకు తీవ్ర కోపం తెప్పించాయి. ఆంధ్ర మహా సభ కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజల్ని ఒక తాటి మీదకు తెచ్చి పోరాటాలు ప్రారంభించింది. దేశ్ముఖ్ లఅమానుష అకృత్యాల్ని ఎండగట్టడం కోసం తన బలాన్ని పెంచుకుంటున్న సందర్భమది. 1946 జులై 4న ఆంధ్ర మహాసభ వలంటీర్లు కడివెండి గ్రామంలో ఒక ఊరేగింపు తీశారు. ఊరేగింపు దేశ్ముఖ్గడీ ముందుకు చేరే సమయానికి దేశ్ముఖ్గూండాలు తుపాకులతో ఊరేగింపుపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఊరేగింపు ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్యకు తూటా తగిలి అక్కడికక్కడే అమరుడయ్యాడు.
అగ్గి రగిల్చిన అమరత్వం
దొడ్డి కొమురయ్య మరణ వార్త చుట్టు పక్కల గ్రామాలకు దావానంలా వ్యాపించింది. అమరుడైన కొమురయ్యకు నివాళి అర్పించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. జన సామాన్యంలో ఆ మెరుపు సంఘటన ప్రకంపనలు సృష్టించింది. కొమురయ్య బలిదానంతో వరంగల్, ఖమ్మం, కరీంనగర్జిల్లాల్లో అనేక పోరాటాలు నడిచాయి. కడివెండి పొరుగు గ్రామంలో భూస్వామి తాలూకు 200 ఎకరాల భూమిని ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పేదలకు పంచారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఫ్యూడల్దోపిడీని, అణచివేతను ప్రశ్నించే స్థాయికి ఎదగడమే గాక నిజాం పాలనను తిరస్కరించే స్థాయిలో ఉద్యమం దూసుకెళ్లింది. తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో దొడ్డి కొమురయ్య అమరత్వం ఒక కొత్త ఉత్తేజాన్ని, జాగృతిని, తెగింపును పురికొల్పింది. ఇదే తరహాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ పోరాటంలో శ్రీకాంతాచారి అమరత్వం తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. ఇలాంటి అమరుల త్యాగాలపై నిలిచిన తెలంగాణ ప్రజల చైతన్యం, పోరాట స్ఫూర్తి, ఉత్తేజం కలిగిస్తుంది. స్వాతంత్య్రోద్యమ రోజుల్లో భగత్సింగ్అమరత్వం దేశ ప్రజలను ముఖ్యంగా కుదిపేసిన సంఘటన. అలాగే దొడ్డి కొమురయ్యను తెలంగాణ భగత్సింగ్గా స్మరించుకుందాం. ఇదే మనం కొమురయ్యకు
ఇచ్చే నిజమైన నివాళి.
- డా. కందుకూరి రమేశ్,ఇగ్నో డిప్యూటీ డైరెక్టర్