
ముషీరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేంత వరకు పోరాటం ఆగదని కాంట్రాక్ట్లెక్చరర్లు స్పష్టం చేశారు. 20 ఏండ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించకుండా, ఎలాంటి భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కరెక్ట్‌కాదన్నారు. వెంటనే జీఓ నంబర్21ని సవరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పలు యూనివర్సిటీల నుంచి వచ్చిన కాంట్రాక్ట్ లెక్కరర్లు గురువారం సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్‌చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సోమేశ్వర్ బోనకుర్తి, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల జానకి రెడ్డి, రామస్వామి మాట్లాడుతూ.. పార్ట్ టైం ఉద్యోగుల బాధలు తెలపడానికే సెక్రటేరియెట్ వద్దకు వచ్చామన్నారు. అరెస్ట్ అయిన పార్ట్ టైం అధ్యాపకులను విమలక్క కలిసి సంఘీభావం ప్రకటించారు. అలాగే తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్లెక్చరర్లు గాంధీ భవన్ ను ముట్టడించారు. పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేశారు.