నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాగా స్వరాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటం చేశారు. ఉద్యమ పార్టీ, నేత అని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు సరికదా.. కొత్తగా విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్వార్త యువత ఆశలను కొల్లగొట్టింది. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ తీరు తేటతెల్లమైంది. జరిగింది చిన్న పొరపాటు కాదు.. 30 లక్షల మంది యువత భవిష్యత్‌ను, సమాజాన్ని, అంతిమంగా ప్రభుత్వాన్నీ ప్రభావితం చేసే పెద్ద తప్పు. దీనిపై నైతిక బాధ్యత వహించాల్సిన రాష్ట్ర సర్కారు ప్రతిపక్షాలతో మాటల యుద్ధంతోనే సరిపెడుతున్నది.
ఉద్యోగాల భర్తీలో జాప్యం
రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలు అక్షరాలా 1,91,604 ఉన్నాయని ప్రభుత్వానికి బిశ్వాల్ కమిటీ నివేదిక అందించింది. ఎనిమిది సంవత్సరాలుగా ఎప్పటి ఖాళీలు అప్పుడు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి.. ఎన్నికల ఏడాది ముందు భర్తీ చేయాలనుకుంది. లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఉద్యోగాల జాతర ఊదరగొట్టిన నేతలు.. ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై స్పందించడం లేదు. స్వరాష్ట్రంలో చదివిన చదువులకు సార్థకం ఉద్యోగమే అనే పద్ధతుల్లో లక్షలాది మంది విద్యార్థులున్నారు. ఉద్యోగ అవకాశాలు దొరక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ప్రభుత్వ నోటిఫికేషన్లు చూసి.. వేల రూపాయలు దరఖాస్తు ఫీజులు, కోచింగ్సెంటర్లలో ఫీజులు కట్టి కష్టపడి చదివిన యువత.. పేపర్ లీకేజీతో మనోవేదనకు గురవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన టీఎస్ పీఎస్సీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
అంగట్లో సరుకులా అమ్మేశారు..
రాష్ట్రంలో ఇంత పెద్ద పేపర్ లీకేజీ స్కామ్ జరిగినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. నిరుద్యోగులకు ఏమీ జరగనట్లే మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల పాత్ర తప్ప వేరే ఎవరూ లేరని అన్నారు. కానీ సిట్ విచారణలో మల్టీలెవెల్మార్కెటింగ్తరహా ప్రశ్న పత్రాల అమ్మకం జరిగిందని తెలుస్తున్నది. చాలా పేపర్లు లీక్ కావడం, నిందితులు లక్షల రూపాయలకు వాటిని అమ్ముకోవడం.. చిన్నగా బయటకు వస్తున్నవి. ఇంత జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ స్పందించడం లేదు. నిరుద్యోగుల బాధలు, వాళ్ల గోస ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇప్పటికైనా పట్టభద్రుల ఓట్లతో ఎమ్మెల్సీలు అయిన వారైనా స్పందించాలి. సత్వర చర్యలతోపాటు అధైర్య పడుతున్న ఉద్యోగ అభ్యర్థులకు ఆర్థికంగా, మానసికంగా ధైర్యం ఇవ్వాలి.
చైర్మన్‌ను తొలగించాలి
ప్రశ్నపత్రాలను భద్రపరిచే విధిలో విఫలమై.. 30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన టీఎస్ పీఎస్సీ చైర్మన్‌కు ఇప్పటి దాకా నోటీసులు ఇవ్వలేదు. ఆయనను కూడా బాధ్యుడిగా భావించి విచారణ జరపాలి. లేదంటే ప్రశ్న పత్రాలు లీకేజీ వ్యవహారంలో అసలు దోషులను వదిలిపెడుతున్నారనే ప్రచారం నిజమని భావించాల్సి ఉంటుంది. చిన్నా చితక వాళ్లను అరెస్టు చేసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నిరుద్యోగ యువత నిర్ధారణకు వస్తారు. అందుకే ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌జడ్జి నేతృత్వంలో విచారణ జరిపితే.. పారదర్శకత ఉంటుందని నిరుద్యోగులు మళ్లీ నమ్మకంగా పోటీ పరీక్షకు సన్నద్ధమవుతారు.
అసలు దోషులను బయటికి తీసి, నిరుద్యోగులకు న్యాయం జరిగినప్పుడే సమాజంలో ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఫ్రీ కోచింగ్, హాస్టల్ వసతి, స్టడీ హాల్స్, మెటీరియల్ ఉచితంగానే ప్రభుత్వం అందించాలి. ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు పరిహారంగా ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎన్నో కలలతో నగరానికి వచ్చి పస్తులుంటూ.. ఉద్యోగం కోసం విరామం లేకుండా చదివే అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవద్దు.
- పెద్దింటి రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు, పీడీఎస్‌యూ