వసతి గృహాల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు.. పట్టించుకోని ఆఫీసర్లు

ఆసిఫాబాద్,వెలుగు : ఏజెన్సీలోని ట్రైబల్​ వెల్ఫేర్​ హాస్టళ్ల విద్యార్థులు బోరు నీరే తాగాల్సి వస్తోంది. వసతి గృహాల్లోని వాటర్​ ఫిల్టర్లు  ఖరాబయ్యాయి. రిపేర్​ చేసి మంచినీరు అందించాల్సిన ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఫలితంగా స్టూడెంట్స్ అపరిశుభ్రమైన నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 46 ట్రైబల్​ వెల్ఫేర్​హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు12,255 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రతీ హాస్టల్​లో రూ.10 లక్షలు ఖర్చుచేసి ఆర్వో ప్లాంట్​ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఏ ఒక్క హాస్టల్​లో ప్లాంట్​ పనిచేయడంలేదు. దీంతో విద్యార్థులు బోరునీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నారు. రోగాల బారినపడుతున్నారు.

నీటి సౌకర్యం కరువు...

జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో ఇప్పటికీ ఎలాంటి నీటి సౌకర్యం లేదు. జైనూర్ మండలం మార్లవాయి హాస్టల్​ విద్యార్థులు వ్యవసాయ బావి నీటిని తాగుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బావుల్లో నీరంతా కలుషితమైంది. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. మరోవైపు బావి యజమాని నీరు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. విషయాన్ని స్థానికులు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కెరమెరి మండలం రాంజీగుడా, జోడేఘాట్, సిర్పూర్ (టి) హాస్టళ్ల ఆర్వో ప్లాంట్లు ఖరాబై ఏండ్లు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో విద్యార్థులంతా బోరుబావుల నీరే తాగుతున్నారు.

ఆఫీసర్లు పట్టించుకుంటలేరు..

జోడే ఘాట్​ హాస్టల్​లో ఏండ్ల సంది ఆర్వో ప్లాంట్​ పనిచేయడంలేదు. ఆఫీసర్లు రిపేర్​చేయడంలేదు. శుద్ధమైన తాగునీరు అందక విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. 
– పెందోర్, రాజేశ్వర్, జోడేఘాట్

బాయినీళ్లు తెచ్చుకుంటున్నం...

స్కూల్​లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్​పనిచేయడంలేదు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి నీరు తెచ్చుకుంటున్నం. వర్షాలు పడడంతో ఇప్పుడు ఆ నీరంతా కలుషితమైంది.
– పెందోర్ జైవంత్ రావు, వార్డెన్, మార్లవాయి

రిపేర్​ చేస్తం.. 

జిల్లాలోని ట్రైబల్​వెల్ఫేర్​హాస్టళ్లలో నిరుపయోగంగా ఉన్న అన్ని ఆర్వో ప్లాంట్లను త్వరలో రిపేర్​చేయిస్తాం. విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందిస్తాం.
–మణమ్మ, డీటీడీవో, ఆసిఫాబాద్