ఆయుర్వేద కాలేజీ సమస్యలు పరిష్కరిస్తాం
అధికారుల హామీ.. ఆందోళన తాత్కాలికంగా విరమణ
వరంగల్ సిటీ, వెలుగు : అనంతలక్ష్మీ ఆయుర్వేద మెడికల్ కాలేజీ స్టూడెంట్లు ఎట్టకేలకు శాంతించారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హోమియో డైరెక్టర్ లింగరాజు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మొదటి సంవత్సరం అడ్మిషన్ల రద్దు విషయంపై.. సెంట్రల్ ఆఫీసర్లతో మాట్లాడుతామన్నారు. కాలేజీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. పోస్టుల భర్తీపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఆఫీసర్ల హామీతో విద్యార్థులు ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
అన్ని గ్రామాల్లో ఆట స్థలాలు ఉండాలి
మహబూబాబాద్, వెలుగు : అన్ని గ్రామ పంచాయతీల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన రివ్యూ నిర్వహించారు. జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉండగా హ్యాబిటేషన్లతో కలుపుకొని 702 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 10, 5 గుంటల స్థలాల్లోనూ ఆట స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, డీఆర్డీవో సన్యాసయ్య ఉన్నారు.
ఓటీపీలు షేర్ చేయొద్దు
జనగామ అర్బన్, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఓటీపీలు షేర్ చేయవద్దని జనగామ డీసీపీ సీతారాం సూచించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బుధవారం జనగామ జిల్లాకేంద్రంలోని బాణాపురంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్తు తెలియని కాల్స్, మెసేజ్ లకు స్పందించవద్దన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్ యాదవ్, ఎస్సైలు ఉన్నారు.
మోసపోతే 1930 నంబర్ కు కాల్ చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్ : సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని, 24 గంటల లోపు ఫోన్ చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ రఘుచందర్ సూచించారు. బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. యువత చదువులో రాణించి, జీవితంలో స్థిరపడాలన్నారు.
టీఆర్ఎస్ వి పచ్చి అబద్దాలు
ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకాకపోవడం వాళ్ల తప్పే
ములుగు, వెలుగు : ట్రైబల్ యూనివర్సిటీపై ఎంపీ సీతారం నాయక్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఈ యూనివర్సిటీకి కేంద్రం 2017లోనే రూ.10కోట్లు, మొన్నటి బడ్జెట్ లోనూ మరిన్ని నిధులు కేటాయించినా.. రాష్ట్రమే ప్రపోజల్స్ పంపలేదని ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీ మెరుగ్గా సాగుతోందని, ఇక్కడ మాత్రం కేసీఆర్ అహంకారంతో యూనివర్సిటీ ఆగిపోయిందన్నారు. తాత్కాలిక క్లాసుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రపోజల్స్ పంపలేదన్నారు. యూనివర్సిటీని ఇక్కడి నుంచి తరలించేందుకు కొందరు టీఆర్ఎస్ నాయకులే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎంపీగా పనిచేసిన బలరాం నాయక్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు.
‘టీఆర్ఎస్ కు రోజులు దగ్గరపడ్డయ్’
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే సర్కారుకు ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ లీడర్లు మండిపడ్డారు. మునుగోడులో మాజీ మంత్రి, ఈటల రాజేందర్ కాన్వాయ్ పై దాడికి నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ధర్నాలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మునుగోడులో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
- వెలుగు నెట్ వర్క్
దుండగులను కఠినంగా శిక్షించాలి
వెలుగు నెట్ వర్క్ : జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసంపై దళిత సంఘాల లీడర్లు భగ్గుమన్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్నే ధ్వంసం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ట్రైబల్ యూనివర్సిటీపై టీఆర్ఎస్ దీక్ష
ములుగు, వెలుగు : ములుగులో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ దీక్ష చేపట్టారు. బుధవారం గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయించిన స్థలంలో నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రమే నిర్లక్ష్యం చేస్తోందని, రాష్ట్ర బీజేపీ లీడర్లు కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. భూమి కేటాయించలేదని బుకాయించడం సరికాదని, కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి, అసత్యాలు మానుకొని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయ చైర్మన్ కోరిక గోవింద నాయక్, ప్రజాసంఘాల నాయకుడు ముంజాల బిక్షపతి, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి తదితరులున్నారు.
హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా రఘురాం నాయక్
మహాముత్తారం, వెలుగు : నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన కోర్ర రఘురాం నాయక్ నియామకమయ్యారు. జాతీయ కమిటీ చైర్మన్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఐలనేని శ్రీనివాసరావు ఈమేరకు బుధవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన జాతీయ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షుడికి, తన నియమకానికి సహకరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొగుల్ల భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాస మహేశ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేద వర్గాలకు న్యాయం చేస్తూ మానవ హక్కులను కాపాడే విధంగా కృషి చేస్తానని రఘురాం తెలిపారు.