బాలికల పాఠశాల హాస్టల్లో భద్రత కరువు

ఖమ్మం అర్బన్ మండలం వెలుగు మట్ల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలకు రక్షణ లేకుండా పోతోంది. విద్యార్థినీలు ఉండే హాస్టల్ లోకి నల్ల ముసుగు ధరించి గోడ దూకాడో దుండగుడు. దీంతో వారిని చూసిన విద్యార్థినీలు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు బాలికలు గాయపడ్డారు. విషయం తెలియగానే గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు పాఠశాల ప్రిన్సిపాల్. 

ఆకతాయిల బెడదపై మూడు రోజుల నుంచి విద్యార్థినీలు ఫిర్యాదు చేస్తున్నా కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల సిబ్బంది పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి.. హాస్టల్ లోకి ప్రవేశిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 

గత నాలుగు, ఐదు రోజులుగా హాస్టల్ వద్దకు ఆకతాయిలు వస్తున్నారని పోలీసులకు కస్తూర్భా సిబ్బంది ఫిర్యాదు చేసింది. డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏకంగా అర్బన్ సీఐకి కాల్ చేసినా ఫలితం లేదని ఆధారాలు చూపిస్తున్నారు కస్తూర్భా సిబ్బంది.