తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలోనే చట్టసభల తీరు అత్యంత దురదృష్టకర పరిస్థితుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఉద్యమం నిర్మించింది స్వయం పాలన కోసం, స్థానిక అవసరాల మేరకు స్థానికుల నిర్ణయాలు ఉండాలని. స్వయం పాలనను ప్రతిబింబించే చట్టసభలు(శాసనసభ, శాసన మండలి) ఆ మేరకు పని చేయకపోవడం ఉద్యమ ఆకాంక్షల మీద నీళ్లు పోసినట్టే. చట్టసభలు నడిచే తీరు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న నిబంధనలు, విధి విధానాలు, సంప్రదాయాలకు లోబడి ఉంటుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు కొంత మేర ఆయా సంప్రదాయాల మేరకు పని చేసినా, రెండో దఫా ప్రభుత్వంలో సభల నిర్వహణ పూర్తిగా దారి తప్పింది. చట్టసభల నిర్వహణ ఎవరికీ పట్టలేదు. అకస్మాత్తుగా సమావేశాలు నిర్ణయించడం, కేవలం 2 లేదా 3 రోజులు మాత్రమే సమావేశమవ్వడం ద్వారా ఒక కొత్త పద్ధతికి తెలంగాణ ప్రభుత్వం తెర లేపింది.
2020లో బడ్జెట్ సమావేశాలు 8 రోజులకే ముగించింది. బడ్జెట్ ప్రతిపాదనలతో సహా 6 బిల్లులు ఈ సెషన్లో ఆమోదించారు. ముఖ్యమైన బడ్జెట్ ప్రతిపాదనల మీద చర్చ కేవలం 48 గంటల 41 నిమిషాలలో ముగిసింది. ఆ సమయంలో కూడా అసలు చర్చ తక్కువే. ఊకదంపుడు ఉపన్యాసాలు, భజన తప్పితే అర్థవంతమైన చర్చ జరగలేదు. రాజ్యాంగం నిర్దేశిస్తోంది కాబట్టి మొక్కుబడిగా 6 నెలలకోసారి కొన్ని రోజులు సమావేశాలు జరుపుతున్నారు, తప్పితే పూర్తి స్థాయి సమావేశాలు జరగడం లేదు. ప్రభుత్వం తలుచుకుంటే, అవసరం అనుకుంటే సమావేశాలు.. లేకుంటే లేదు. స్వయం పాలనలో చట్టసభల పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది తెలంగాణ అధికార పార్టీ. 2021లో శాసన మండలి చైర్మన్ పదవి 3 నెలలు ఖాళీగా ఉంది. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
చట్టసభల్లో రాజకీయ ప్రతీకారాలు..
శాసనసభ, శాసన మండలిలో కేవలం ఎన్నికైన సభ్యులే కాకుండా ప్రజలు కూడా పాల్గొనే అవకాశం కమిటీల ద్వారా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో చట్టసభల కమిటీలు అన్నింటిని నిర్వీర్యం చేశారు. పిటిషన్ల కమిటీ, ప్రజా పద్దుల కమిటీ, ఇంకా ఇతర కమిటీలు ఉన్నా అవి సమావేశం కావడం లేదు. పని చేయడం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రజా పద్దుల కమిటీ ప్రతిపక్ష నాయకుడు అధ్యక్షుడిగా ఉండి.. ప్రభుత్వ కార్యక్రమాల మీద నిఘా పెట్టేది. అధికారులను పిలిచి వివరణ కోరేది. ఈ కమిటీని ప్రతిపక్షాలు, పాలక పక్షాలు రెండూ విస్మరించాయి. కాంగ్రెస్ సభ్యులు కొందరు అధికార పార్టీలో కలిశాక ప్రజా పద్దుల కమిటీ ప్రతిపక్షం కాకుండా మిత్రపక్షానికి కట్టబెట్టిన ఏకైక శాసనసభ తెలంగాణ. శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగితే ప్రివిలేజ్ కమిటీకి చెప్పవచ్చు.
శాసన సభలో ఇదివరకు ప్రతి శాఖ పద్దు మీద చర్చ జరిగేది. నిధుల కేటాయింపుల గురించి మార్పులు చేర్పులు సూచించేవారు. నిధుల ఖర్చు మీద ప్రశ్నలు వచ్చేవి. ఇలాంటి సంప్రదాయాలు అనేకం గాలిలో కలిపేశారు. ప్రజాస్వామ్యంలో, అభివృద్ధిలో చర్చలు, సంప్రదింపులు, సర్వామోదం ద్వారా జరపాల్సిన ప్రక్రియలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 2014లో ఒకే రోజు15 గంటలు కూర్చొని పద్దులన్నింటికీ ఆమోదం ఇచ్చేశారు. రాజకీయ పగలు, ప్రతీకారాలకు చట్టసభలను ఉపయోగించడం శోచనీయం. చట్టసభలు ప్రజల కోసం, ప్రజా హితం మేరకు ఏర్పాటైనవి. వాటిని తమ కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగించడం సరి కాదు.
సామాన్యులకు ప్రవేశం ఎందుకు లేదు?
తెలంగాణలో ఉన్న విచిత్ర సమస్య ఏంటంటే ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం, వేదికలు లేకపోవడం చట్టసభలకు పట్టడంలేదు. వాటి దరిదాపులకు సామాన్యులు చేరే పరిస్థితి లేదు. అంచెలవారీగా పోలీసుల పహారా మధ్య చట్టసభల నిర్వహణ నడుస్తోంది. దీంతో రాజకీయ దళారులకు పని దొరికింది. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం అసలే లేదు. ప్రగతి భవన్ కోటలోకి మంత్రులకే ఒక్కోసారి అనుమతి లేదు. సచివాలయంలోకి సామాన్యులు పోలేరు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయలేరు. జిల్లాల్లో ప్రజా వాణిలో ఇచ్చిన దరఖాస్తులకు దిక్కు లేదు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో అందుబాటులో ఉండరు. ప్రజలు ఎక్కడికి పోవాలె? ప్రజా ధనంతో ఏర్పడిన చట్టసభలకు సామాన్య ప్రజలకు ప్రవేశం ఎందుకు లేదు? ప్రతి ఎన్నికలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి శాసన సభకు ఎన్నికై, ఆ శాసనసభా వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు కొందరు.
ప్రభుత్వ కార్యక్రమంలో తనపట్ల తగిన ప్రొటోకాల్ పాటించలేదని గగ్గోలు పెట్టే ఎమ్మెల్యేలు.. సభ లోపల తమ హక్కులకు భంగం కలుగుతుంటే కిక్కురుమనకపోవటం హాస్యాస్పదం. తమ నియోజకవర్గంలో తమకు చెప్పకుండా, తమ అనుమతి లేకుండా ఏ పని చేయొద్దని అధికారం ప్రదర్శించే ఎమ్మెల్యేలు.. శాసనసభలో తమకు చెప్పకుండా, అనుమతి లేకుండా, చర్చ లేకుండా లక్షల కోట్ల రూపాయలు ఆమోదం పొందుతూ ఉంటే నోరు విప్పరు. శాసనసభను రాజకీయానికి, రాజకీయ ఉపన్యాసాలకు, విమర్శలకు వాడుకోవడం తప్పితే ప్రజా సమస్యలను ప్రస్తావించడం, చర్చించడం, ఉమ్మడిగా పరిష్కారాలను రూపొందించడం వంటి బాధ్యతాయుతమైన పనులకు వినియోగించడం లేదు.
బడ్జెట్ ఆమోదానికి 10 రోజులా?
సాధారణంగా వర్షాకాలం, శీతాకాలం, బడ్జెట్ సమావేశాల ద్వారా చట్టసభలు నిర్వహించేవారు. ఇప్పుడు అవి మొక్కుబడిగా కొన్ని రోజులకే పరిమితం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాసనసభ 5 ఏండ్లలో కేవలం 85 రోజులు మాత్రమే సమావేశం కాగా, రెండో సభ ఇప్పటివరకు 93 రోజులు సమావేశమైంది. దీని కాలం కూడా దగ్గర పడింది. మొత్తం10 ఏండ్లలో శాసన సభ కేవలం178 రోజులు మాత్రమే సమావేశం అయితే ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి. ఈ 178 రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద చర్చ జరిగింది చాలా తక్కువ. సమావేశం అయినప్పుడు పాటించాల్సిన సభా సంప్రదాయాలు గాలికి ఒదిలేసి, ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రుల ఉపన్యాసాలతో సరిపుచ్చుతున్నారు.
అధికార పక్ష సభ్యులు వ్యక్తిస్తోత్రం దాటి మాట్లాడింది చాలా తక్కువ. మిగతా నెలల్లో ఎట్లా ఉన్నా, బడ్జెట్ సమావేశాలు కనీసం 30 రోజులు ఉండేవి. ఇప్పుడు పట్టుమని 10 రోజులు కూడా ఉండటం లేదు. ఈ 10 రోజులు కూడా బడ్జెట్ పద్దుల మీద జరిగిన చర్చ అతి తక్కువ. అలా బడ్జెట్ చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఆగస్టు 2023లో కేవలం 3 రోజులు సమావేశం అని చెప్పి ఒక రోజు పొడిగించి, మొత్తం 4 రోజుల్లో కేవలం 26 గంటల 45 నిమిషాలు సెషన్ నడిపి12 బిల్లులను ఆమోదించారు. సమావేశాలు ముగిసిన మరుసటి రోజు మంత్రి కేటీఆర్ చేనేత రంగానికి దాదాపు రూ.300 కోట్లతో కొన్ని పథకాలు ప్రకటించారు. ఇదే ప్రకటన శాసనసభలో చేసి ఉంటే సభకు గౌరవం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం అది చేయలేదు.
ఆ బాధ్యత ప్రజలదే..!
సంప్రదాయాలు, విధులు, విధానాలు, పద్ధతులు, చట్టాల అతిక్రమణకు ఆలవాలంగా శాసన సభ మారితే ప్రజాస్వామ్యంలో ఇంకేం మిగులు తుంది? భారత రాజ్యాంగం అందించిన శాసన సభను ప్రజాస్వామ్య వ్యతిరేక వేదికగా మలిచిన ఒక నియంతృత్వ పాలకుల బృందం, ఇలాంటి అధికారం కొనసాగించటానికి మళ్లీ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. తమ పార్టీ అభ్యర్థులు గెలవకుంటే వైరి పక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దుస్సంప్రదాయం ఇప్పటికే వేళ్లూనుకుందీ అతి పిన్న వయసు గల తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు శాసనసభ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల పట్ల, అధికార పార్టీ చర్యల పట్ల, వైరి పక్షాల చేతగానితనం పట్ల, జాగురూకులు కావాల్సిన అవ సరం ఉంది. శాసనసభ్యులను ఎండగట్టాలి. ప్రజలే శాసనసభను కాపాడుకోవాలి. శాసనసభ సమావేశాలను కనీసం 200 రోజులు నిర్వహిస్తామనే వాగ్దానం ప్రతీ పార్టీ దగ్గర తీసుకోవాలి.
మట్టిలో కలిసిన సంప్రదాయాలు..
అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అనేక సంప్రదాయాలు మట్టిలో కలిసిపోయాయి. 2022 బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. సాధారణంగా గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేస్తున్న పనుల నివేదిక ఉంటుంది. దాని మీద సభ్యులు చర్చిస్తారు. ఆ ప్రసంగం లేదంటే తెలంగాణ ప్రభుత్వ పాలన మీద చర్చకు ముగింపు పలకడమే. చట్టాలను ఆమోదించే సుదీర్ఘ ప్రక్రియను కుదించేశారు. కేవలం గంటల వ్యవధిలో ముసాయిదా ప్రతిపాదనలు ప్రవేశపెట్టి ఆమోదించేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా, చర్చ లేకుండా మూజువాణి ఓటు పేరుతో చట్టాలు ఆమోదం అవుతున్నాయి. అలాంటి చట్టాల్లో లోపాలు అనేకం తర్వాత బయటపడుతున్నాయి.
కోర్టుల్లో కేసులు పేరుకుపోవడానికి ఇలాంటి అత్యవసర చట్ట ప్రక్రియలను అనుసరించడం కూడా ఒక కారణం. ధరణి పోర్టల్ కోసం సవరించిన ఆర్వోర్చట్టం వల్ల దాదాపు 2 లక్షల కేసులు హైకోర్టులో దాఖలు ఇలాంటి దుశ్చర్య వల్లనే. ఒక ముసాయిదా చట్ట ప్రతిపాదన(బిల్లును) రూపొందించిన వెంటనే పత్రికల్లో ప్రచురించి, ప్రజాస్వామ్య పద్ధతిలో సాధారణ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయాన్ని నిర్మాణాత్మకంగా పొందుపరిచేలా బిల్లును సవరించి, ఆ తర్వాత మంత్రులు లేదా ప్రైవేట్ సభ్యులు చట్ట సభల్లో ప్రవేశపెట్టవచ్చు. ఈ ప్రక్రియను అంతటా తుంగలో తొక్కుతున్నారు.
- డా. దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్