ఏపీకి తరలుతున్న సబ్సిడీ జీలుగ

ఏపీకి తరలుతున్న సబ్సిడీ జీలుగ
  •     గ్రానైట్‌‌‌‌ భూములు, మామిడి తోటలకు పంపిణీ చేసినట్లు రికార్డులు
  •     రైతుల పేరున విత్తనాలు తీసుకొని ఏపీకి తరలిస్తున్న దళారులు
  •     కలెక్టర్‌‌‌‌ సీరియస్‌‌‌‌ కావడంతో కొనసాగుతున్న విచారణ

మహబూబాబాద్,వెలుగు : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందాల్సిన సబ్సిడీ జీలుగ విత్తనాలు ఏపీకి తరలిపోతున్నాయి. అక్కడ జీలుగ విత్తనాలు దొరకకపోవడంతో కొందరు వ్యక్తులు సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రైతుల పేరున రికార్డులు సృష్టిస్తూ విత్తనాలను యథేచ్ఛగా ఏపీకి తరలిస్తున్నారు. దీంతో తెలంగాణ రైతులకు విత్తనాల కొరత ఏర్పడుతోంది. విత్తనాల కోసం రైతులు ఆగ్రోస్‌‌‌‌, పీఏసీఎస్‌‌‌‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.

రైతులకు తెలియకుండానే రికార్డుల్లో నమోదు

జీలుగ విత్తనాలను పచ్చి రొట్ట ఎరువుగా వాడుతుంటారు. వానాకాలం సీజన్‌‌‌‌లో ఈ విత్తనాలకు డిమాండ్‌‌‌‌ ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ఈ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు వ్యక్తులు తెలంగాణకు చెందిన రైతుల పేరున రికార్డులు తయారు చేసి విత్తనాలను అక్కడికి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తొర్రూరు మండలం జమస్తాన్‌‌‌‌పురం గ్రామానికి చెందిన ఓ రైతు అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌ బుక్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ లాకర్‌‌‌‌లో ఉంది. ఆయన పేరిట ఆరు బ్యాగుల జీలుగు విత్తనాలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. గుర్తూరు గ్రామానికి చెందిన రైతు గుడివాడ సోమయ్యకు 3.18 ఎకరాలు ఉండగా 2 బస్తాలు, ఖానాపురం గ్రామ రైతు వెంగల్‌‌‌‌ సోమిరెడ్డికి ఐదు ఎకరాలు ఉండగా మూడు బ్యాగుల జీలుగ విత్తనాలు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అలాగే గ్రానైట్‌‌‌‌ భూములు, మామిడి తోటలకు సైతం జీలుగ విత్తనాలు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. గ్రామాల వారీగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. విత్తనాల అక్రమదందాపై ఎంక్వైరీ చేయాలని కలెక్టర్‌‌‌‌ ఆదేశించినా అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అక్రమార్కులకు సహకరిస్తున్న ఏవోలు

ముప్పై కిలోల జీలుగ విత్తనాల బ్యాగ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ధర రూ. 2,790గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో రూ. 1,116కే రైతులకు అందిస్తోంది. అయితే ఏపీలో జీలుగ సబ్సిడీ లేకపోవడంతో కొందరు దళారులు అక్రమ సంపాదనకు స్కెచ్‌‌‌‌ వేశారు. వీరు బార్డర్‌‌‌‌ జిల్లాల్లోని అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లతో కుమ్మక్కై సబ్సిడీ జీలుగ విత్తనాల దందాకు తెరలేపారు. సబ్సిడీ విత్తనాలు కావాల్సిన రైతుల ఆధార్‌‌‌‌ కార్డు, భూమి పాస్‌‌‌‌ బుక్‌‌‌‌ వివరాలను ఓఎస్‌‌‌‌ఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌ యాప్‌‌‌‌లో నమోదు చేశాకే విత్తనాలను మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఆఫీసర్లు రైతులకు జీలుగ విత్తనాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి అక్రమార్కులకు అందజేస్తున్నారు. 

అసలైన రైతులకు అందని జీలుగ

మహబూబాబాద్‌‌‌‌ జిల్లా పరిధిలో ఈ సీజన్‌‌‌‌లో 9,400 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అవసరం ఉన్నాయి. ఇప్పటివరకు 5,412 క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ఇందులో ఆగ్రోస్‌‌‌‌ సెంటర్ల ద్వారా ఇప్పటికే 3,125 క్వింటాళ్ల విత్తనాలు అమ్మారు. మిగిలిన విత్తనాలను సైతం రైతులకు అమ్ముతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం విత్తనాలు దొరకడం లేదు. దీంతో రైతులు ఆగ్రోస్‌‌‌‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.

అక్రమాలకు పాల్పడిన చర్యలు 

మహబూబాబాద జిల్లాకు 5,412 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు రాగా ఆగ్రోస్, పీఏసీఎస్‌‌‌‌ సెంటర్ల ద్వారా 3,125 క్వింటాళ్ల విత్తనాలు అమ్మాం. మిగిలిన విత్తనాల అమ్మకం జరుగుతోంది. తొర్రూరు ప్రాంతంలో అవకతవకలు జరిగినట్లుగా సమాచారం రావడంతో ఏవోకు మెమో జారీ చేసి విచారణ చేస్తున్నాం. అక్రమాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం.
– అభిమన్యుడు, 
జిల్లా అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌