నల్గొండలో ఎండలపై రెడ్ అలర్ట్

  • సూర్యాపేట జిల్లా అంతటా రెడ్ అలర్ట్
  • రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే బుధవారం అత్యధికంగా మట్టంపల్లి మండలంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మునగాల మండలంలో 46.5 డిగ్రీలు, అనంతగిరిలో 46.3, సూర్యాపేట మండలంలోని టేకుమట్లలో 46.2, పెన్ పహాడ్, మోతె మండలంలో 45.9, మట్టంపల్లి మండలంలోని పెదవిడు 45.8, నూతనకాల్ మండలం, మేళ్లచెర్వులో 45.7, ఆత్మకూరు(ఎస్)లో 45.6, కోదాడలో 45.5, హుజుర్ నగర్ 45.4, గరిడేపల్లి 45.3, చింతలపాలెం, నడిగూడెం, చిలుకూరు, మద్దిరాల మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడ దెబ్బకి గురైన వారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకపోతే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నారు.