- ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 43.8 డిగ్రీలు
- మరో రెండు రోజులు భారీ ఎండలు: వాతావరణ శాఖ
- మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మృతి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పగటి పూట టెంపరేచర్ 44 డిగ్రీలుగా రికార్డవుతున్నది. పొద్దున 9 దాటిందంటే చాలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, బయటికెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రద్దీగా కనిపించే రోడ్లన్నీ మధ్యాహ్నం టైంలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్లో 43.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 43.10 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా కొమ్మెరలో 43 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మెండోరా, భద్రాద్రి జిల్లా మణుగూరులో 42.9 డిగ్రీలు, వనపర్తి జిల్లా కనాయిపల్లి, జగిత్యాల జిల్లా జైనలో 42.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా యెర్గట్లలో 42.6 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.
అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్
నిర్మల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్లు 42 డిగ్రీలను దాటేశాయి. ఇంకో రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రెండు రోజులు 43 డిగ్రీలకుపైనే టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత రికార్డయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వడదెబ్బ తగలకుండా నీళ్లు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నలుపు, మందంగా ఉండే డ్రెస్సులకు బదులు లేత రంగుల్లో లభించే తేలికైన కాటన్ డ్రెస్సులు వేసుకోవాలి. ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉంటే మంచిది. అవసరమైతే తప్ప బయటిరావొద్దు. బయటికి వెళ్లాల్సి వస్తే ఛత్రి, టోపీ పెట్టుకోవడం మంచిది.
వడదెబ్బతో ఇద్దరు మృతి
బెల్లంపల్లి/లక్ష్మణచాంద, వెలుగు: మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు చనిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీకి చెందిన లింగాల శ్రీనివాస్ (50) వడదెబ్బతో చనిపోయినట్లు వన్‌టౌన్ సీఐ టి.శంకరయ్య తెలిపారు. మంగళవారం పొద్దున 11:30 గంటలకు శ్రీనివాస్, పాత బస్టాండ్ వద్ద ఉన్న మాధవి వైన్స్‌కు వచ్చాడని వివరించారు. వడదెబ్బ కారణంగా కిందపడి చనిపోయాడన్నారు. కొన్నేండ్ల నుంచి శ్రీనివాస్ ఇంటికి దూరంగా ఉంటున్నాడని వివరించారు. గతంలో ఫ్రూట్స్ అమ్మేవాడని, తర్వాత మంచిర్యాలలో కూలి పని చేసుకుంటూ జీవించేవాడని తెలిపారు. మృతుడికి భార్య మాలతి, కొడుకు రాకేశ్, కూతురు లోహిత ఉన్నారన్నారు. కొడుకు రాకేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకరయ్య తెలిపారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ)కు చెందిన ఉపాధిహామీ కూలీ పడిగెల రవి (45) వడదెబ్బతో చనిపోయాడని ఎస్ఐ రాహుల్ తెలిపారు. దివ్యాంగుడైన రవి ఉపాధిహామీ కూలీ పనులకు వెళ్లేవాడని వివరించారు. మంగళవారం మధ్యాహ్నం పనులు చేస్తుండగానే చనిపోయాడని వివరించారు. మృతుడికి భార్య రాజమణితో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్నారు.