మ్యారిటల్ రేప్ పిటిషన్లపై సుప్రీం విచారణ వాయిదా

మ్యారిటల్ రేప్ పిటిషన్లపై సుప్రీం విచారణ వాయిదా

న్యూఢిల్లీ: మ్యారిటల్ రేప్ ను నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నెల రోజులకు వాయిదా వేసింది. ఓవైపు ఈ నెల 26 నుంచి నవంబర్ 4 వరకు దీపావళి సెలవులు ఉండడం, మరోవైపు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10న రిటైర్ కానుండడం.. అంతలోపు విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు పూర్తి చేసేందుకు ఎన్ని రోజుల టైమ్ కావాలని లాయర్లను బెంచ్ అడిగింది. తమకు ఒక్కొక్క రోజు చొప్పున కావాలని సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకరనారాయణన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది తెలిపారు. 

దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. ‘‘మీరు ఒక్కొక్క రోజు చొప్పున కావాలని చెప్పారు. ఇంకా ఇతర న్యాయవాదులు కూడా ఉన్నారు. వాళ్లూ ఒక్కొక్క రోజు చొప్పున తీసుకుంటారు. కాబట్టి ఈ వారంలో వాదనలు పూర్తి కావు. నేను రిటైర్ అయ్యేలోపు విచారణ పూర్తి చేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు” అని చెప్పారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. పిటిషన్లను మరో బెంచ్ ముందుంచాలని ఆదేశాలు ఇచ్చారు.