న్యూఢిల్లీ: ఇటీవల దేశంలో ఈవీఎంల పని తీరుపై పలువురు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం వైఎస్ జగన్ వంటి వారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు.. ఓడిపోతే ట్యాంపరింగ్ జరిగినట్టా..? అని ఈ సందర్భంగా పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
రాజకీయ నాయకులు ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంల పని తీరుపై ఆరోపణలు చేస్తారని ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కాగా, ఎన్నికలను ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ వంటి రాజకీయ నేతలు కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారని.. నా గ్లోబల్ పీస్ సమ్మిట్ సందర్భంగా కూడా ఈవీఎం టెక్నాలజీని ట్యాంపరింగ్ చేయవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారని కేఏ పాల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వీటిని పరిగణలోకి తీసుకుని ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా మళ్లీ బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని కోరారు.
ALSO READ | ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ
కేఏ పాల్ పిటిషన్‌పై 2024, నవంబర్ 26వ తేదీన జస్టిస్ విక్రమ్ నాథ్, పీబీ వరాలేతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. కేఏ పాల్ వాదనలతో విభేదించిన బెంచ్.. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, పీబీ వరాలేతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు, జగన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అంటున్నారు.. గెలిచినప్పుడు వారు ఈవీఎంల పని తీరుపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని.. అలాంటప్పుడు వారి వ్యాఖ్యలను ఎలా పరిగణలోకి తీసుకుంటున్నామని నిలదీసిన బెంచ్.. కేఏ పాల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.