- ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ఏపీ సీఎం చంద్రబాబుపై దాఖలైన రెండు పిటిషన్లు డిస్మిస్
న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాలను వేదికలుగా వాడుకోవద్దని ‘ఓటుకు నోటు’ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అర్థరహిత అంశాలతో కోర్టులతో ఆడుకోవద్దని పిటిషనర్‌ను మందలించింది. ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు అయినప్పటికీ మళ్లీ ప్రెష్‌గా విచారణ జరపి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే) ఏసీబీ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏసీబీ కోర్టు, ఆర్‌కేకు అనుకూలంగా ప్రెష్‌గా విచారణ జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై చంద్రబాబు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా.. ఏసీబీ కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు పక్కనబెట్టింది.
ఈ హైకోర్టు ఉత్వర్వులను సవాల్ చేస్తూ.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్‌కే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను బుధవారం విచారించిన సుప్రీం ధర్మాసనం వాటిని డిస్మిస్ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని, ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లిస్తామని, గైర్హాజరు అయితే రూ.2 కోట్లిస్తామని చెప్పారని నివేదించారు. చంద్రబాబు తరఫు లాయర్ కల్పించుకొని పిటిషనర్ 2014 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని కోర్టుకు నివేదించారు. కోర్టు జోక్యం చేసుకొని, కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని, అంతేతప్ప రాజకీయ కక్షల కోసం రావొద్దంటూ ఆర్‌కేకి సూచించింది. ఈ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనపడటం లేదని, ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.