రాజ్యాంగ ప్రవేశికలో ఆ పదాలు తొలగించలేం: సుప్రీం కోర్టు కీలక తీర్పు

రాజ్యాంగ ప్రవేశికలో ఆ పదాలు తొలగించలేం: సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘సోషలిజం’, ‘సెక్యులరిజం’ అనే పదాల తొలగింపు పిటిషన్‎పై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రవేశిక నుండి ఆ రెండు పదాలను తొలగించాలని దాఖలైన పిటిషన్‎ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‎కు ఉందని.. దాని ఆధారంగానే రాజ్యాంగంలో అంతర్భాగమైన ప్రవేశికను సవరించారని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడిన సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను తొలగించాలని బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్, బలరామ్ సింగ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్‎లో ఎలాంటి చర్చ లేకుండానే ఈ పదాలను రాజ్యాంగంలో పొందుపర్చారని.. ఈ పదాలను రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించాలని కోరారు. 

ఈ పిటిషన్‎పై సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌‎లతో కూడిన బెంచ్ నవంబర్ 22న విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. 2024, నవంబర్ 25వ తేదీన ఈ పిటిషన్‎పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ప్రవేశికతో సహా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌‎ బెంచ్ తేల్చి చెప్పింది. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు అంతర్భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఈ పదాలను వివిధ మార్గాల్లో అర్థం చేసుకోగలిగినప్పటికీ, వాటిని పాశ్చాత్య పదాల అర్థంలో కాకుండా కాకుండా భారతీయ సందర్భంలో అర్థం చేసుకోవాలని సూచించింది. సోషలిస్ట్, సెక్యులర్ అనే రెండు పదాలు1976లో సవరణల ద్వారా ప్రవేశపెట్టిన.. రాజ్యాంగం1949లో ఆమోదించబడినప్పటికీ అందులో ఎటువంటి తేడా లేదని పేర్కొంది. ఈ పిటిషన్లపై వివరణాత్మక విచారణ అవసరం లేదని సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌‎లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. కాగా, 1976లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో  ‘సోషలిజం’, ‘సెక్యులరిజం’ అనే పదాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే