న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జస్టీస్ అజయ్ రస్తోగి, జస్టీస్ అభయ్ ఎస్.ఓకాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 25 లక్షల మంది అంగన్వాడీ సిబ్బందికి లబ్ది కలగనుంది. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను అమలు చేయడంలో అంగన్వాడీ సిబ్బంది సేవలను పరిగణలోకి తీసుకొని సుప్రీం ఈ తీర్పునిచ్చింది. అంగన్‌వాడీ కార్యకర్తలు పూర్తిస్థాయి ఉద్యోగులు కాదన్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు... గ్రాట్యుటీ చెల్లింపు చట్టం అంగన్‌వాడీ కేంద్రాలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు వర్తిస్తుందని పేర్కొంది.
దీంతో గ్రాట్యుటీ ఇవ్వాలంటూ 16 ఏళ్ల కిందట గుజరాత్ లో మొదలైన అంగన్వాడీ కార్యకర్తల పోరాటం ఫలించినట్లయింది. అంగన్వాడీ లబ్దిదారుల గుర్తింపు, పౌష్టికాహారం వండడం, పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించడం, గర్భణీలకు పాలు, ఇతర ఆహార సామగ్రి అందించడం వంటి ఎన్నో విధులు నిర్వహిస్తున్నామని, కాబట్టి తమకు గ్రాట్యుటీ ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ వచ్చారు. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ అందనుంది.
మరిన్ని వార్తల కోసం...