HCA వ్యవహారంలో‌‌ కమిటీ : నివేదికపై సుప్రీంలో విచారణ

HCA వ్యవహారంలో‌‌ కమిటీ : నివేదికపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌‌సీఏ)లో నెలకొన్న వివాదాలపై నియమించిన జస్టిస్‌‌ లావు నాగేశ్వర రావు ఏకసభ్య కమిటీ నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హెచ్‌‌సీఏలో ఒకే కుటుంబ పెత్తనం, హెచ్‌‌సీఏ ఎలక్ట్రోరల్ జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ కోసం గతంలో సుప్రీంకోర్టు జస్టిస్ లావు నాగేశ్వర రావు ఏకసభ్య కమిటీని నియమించింది. తాజాగా నివేదికపై విచారణ చేపట్టిన కోర్టు.. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రతివాదుల వాదనలు వింటామని వెల్లడించింది. హెచ్‌‌సీఏ అధ్యక్ష ఎన్నికల విధానం, ఓటరు నమోదు తదితర అంశాలపై 2021 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో హెచ్‌‌సీఏ పిటిషన్ దాఖలు చేసింది. 

చార్మినార్ క్రికెట్ క్లబ్, బడ్డింగ్ స్టార్ క్రికెట్ క్లబ్‌‌లను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో తొలుత జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని వేసింది. దీంతో కమిటీ హెచ్‌‌సీఏలో జరిగిన అవినీతి, వివాదాలపై రెడీ చేసిన రిపోర్ట్‌‌ను సుప్రీంకోర్టుకు అందించారు. అలాగే, కోర్టు ఆయనకు కేటాయించిన పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించుకుంటానని కోరారు. దీంతో తదుపరి విచారణ సందర్భంగా జస్టిస్ కక్రూ కమిటీని రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో వన్ మ్యాన్ కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించింది. హెచ్‌‌సీఏ తదుపరి కార్యాచరణ, కమిటీల ఏర్పాటు, నిధుల ఖర్చు వంటి అన్ని అంశాలపై ఏకసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఇచ్చే నివేదిక, సూచనల ఆధారంగా తదుపరి ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. 

హైదరాబాద్ పరిధిలో మొత్తం 217 క్లబ్‌‌లు ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే  57 క్లబ్‌‌ల్లో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఆ కుటుంబం క్లబ్‌‌లను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని, ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది ఓట్లను కలిగి హెచ్‌‌సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని కమిటీ నిర్ధారించింది. అనంతరం తన సిఫార్సులను సుప్రీంకోర్టుకు అందించింది. అయితే, ఇదే టైంలో కొత్తగా ఎన్నికైన హెచ్ఏసీ బోర్డు మెంబర్లు.. జస్టిస్ నాగేశ్వర్ రావు రిపోర్ట్‌‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ సిఫార్సులు, హెచ్‌‌సీఏ సభ్యుల వాదనలపై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీశ్‌‌ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.