పురుషులకూ నెలసరి వస్తే తెలిసేది... మహిళా జడ్జిల తొలగింపుపై సుప్రీం సీరియస్

పురుషులకూ నెలసరి వస్తే తెలిసేది... మహిళా జడ్జిల తొలగింపుపై సుప్రీం సీరియస్

న్యూ ఢిల్లీ: పురుషులకూ నెలసరి వస్తే మహిళల పరిస్థితి తెలిసేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆశించిన స్థాయిలో పనితీరు లేదంటూ మధ్యప్రదేశ్​హైకోర్టు ఆరుగురు మహిళా జడ్జిలను విధుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. గర్భస్రావం కారణంగా ఓ మహిళా జడ్జి అనుభవించిన శారీరక, మానసిక క్షోభను పరిగణలోకి తీసుకోకపోవడంపై సీరియస్​అయింది. 

మహిళా జడ్జిల తొలగింపుపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్​హైకోర్టును ఆదేశించింది. పనితీరు బాగాలేదంటూ గతేడాది మధ్యప్రదేశ్​హైకోర్టు ఆరుగురు మహిళా జడ్జిలను తొలగించింది. అయితే, అందులో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్​బెంచ్​నిర్ణయించింది. మరో ఇద్దరిని విధుల్లోకి తీసుకోలేదు. ఇందులో ఓ మహిళా జడ్జి తనకు గర్భస్రావం జరిగిందని, తన సోదరుడు క్యాన్సర్​ బారినపడ్డాడని కోర్టుకు విన్నవించింది. 

క్వాంటిటేటివ్ వర్క్ అసెస్‌మెంట్‌లో తన మెటర్నిటీ, చైల్డ్ కేర్ లీవ్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే తనకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని పేర్కొన్నది. అయినా హైకోర్టు పట్టించుకోలేదు. ఈ అంశాన్ని  సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. బుధవారం జస్టిస్​ బీవీ నాగరత్న, ఎన్.​ కోటిశ్వర్​సింగ్‎తో కూడిన బెంచ్​విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్​హైకోర్టు చర్యలను తప్పుపట్టింది. 

ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోరా..?

ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగానే జడ్జీలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు​ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఆ న్యాయమూర్తి ఓ మహిళ. ఆమెకు గర్భస్రావం జరిగింది. ఆ సమయంలో ఆమె శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉన్నది. ఆమె కండిషన్‎ను పరిగణనలోకి తీసుకోరా..? పురుషులకూ నెలసరి వస్తే ఆ సమస్య ఎలా ఉంటుందో తెలిసేది” అని జస్టిస్​నాగరత్న వ్యాఖ్యానించారు. మహిళా జడ్జిల విషయంలో పాటించిన ప్రమాణాలే పురుష న్యాయమూర్తులకూ ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.