
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే నెలరోజుల్లో కొన్ని పనులు.. ఆరునెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న పరిమితులపై మాత్రమే స్టే ఇచ్చింది. ప్రతివాదులుగా ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 31 కి వాయిదా వేసింది. కేసులో సుమారు గంటన్నర సేపు ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తర్వాత జరిగే విచారణ లోపు సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ , శ్రీరామ్, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశించిన 7 అంశాలపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. కాల పరిమితికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై మాత్రమే స్టే ఇచ్చింది.