న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న బుల్డోజర్ కల్చర్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బుల్డోజర్ చర్యలు చేపట్టొద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే, ప్రభుత్వ స్థలాలు, ఫుట్ పాత్, రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవచ్చని.. వాటికి ఈ ఉత్తర్వులు అమలు కావని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బుల్డోజర్ కల్చర్ పెరిగిపోతుంది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నేరారోపణలో నిందితులుగా ఉన్న వ్యక్తుల నివాస లేదా వాణిజ్య ఆస్తులను ప్రభుత్వాలు బుల్డోజర్ల ద్వారా నేలమట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇవాళ ఈ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ప్రైవేట్ స్థలాలను బుల్డోజర్ల ద్వారా కూల్చివేయడం సరైన చర్య కాదని పేర్కొంది.
దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ ఆస్తులను అనధికారికంగా కూల్చివేయడంపై అక్టోబరు 1 వరకు స్టే విధించింది. కూల్చివేతలపై స్టే విధిస్తే.. ఇప్పటికే కూల్చివేతలకు సిద్ధమైన పనులపై ప్రభావం చూపుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించగా.. ఆయన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బుల్డోజర్ కూల్చివేతలు ఆపితే స్వర్గం ఏమి ఊడిపడదని ధర్మాసనం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బుల్డోజర్ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అయితే, ప్రభుత్వ స్థలాలు, ఫుట్ పాత్, రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలపై చర్యలకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. వాటికి ఈ ఉత్తర్వులు అమలు కావని స్పష్టం చేసింది. అనంతరం ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.
Also Read:-మోదీ బర్త్ డే గిఫ్ట్.. మహిళలకు రూ.10 వేల డబ్బులు