సుప్రీంలో ఇవాళ కవిత పిటిషన్‌పై విచారణ

సుప్రీంలో ఇవాళ కవిత పిటిషన్‌పై విచారణ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మార్చి 27న విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. 

మార్చి 24న ముందుగా ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా.. జస్టిస్ అజయ్ రస్తోగి,  జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని,  మహిళలను ఇంటి వద్దే  విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి (అరెస్ట్) చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కల్వకుంట్ల కవిత. 

మరోవైపు కవితపై ఇప్పటికే కేవియెట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది ఈడీ. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో ఈడీ ఇప్పటికే కల్వకుంట్ల కవితను మూడురోజుల పాటు ప్రశ్నించింది.